-

ఈవీఎంల కేటాయింపు పూర్తి

28 Nov, 2023 00:28 IST|Sakshi
●పది నియోజకవర్గాల్లో 2,554 పోలింగ్‌ స్టేషన్లు ●అభ్యర్థుల సంఖ్య ఆధారంగా 4,376 బ్యాలెట్‌ యూనిట్లు

ఖమ్మం సహకారనగర్‌: శాసనసభ ఎన్నికల పోలింగ్‌ గురువారం జరగనుంది. ఈమేరకు అధికారులు బుధవారమే సామగ్రి తీసుకుని కేంద్రాలకు చేరుకుంటారు. ఇందుకోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల సంఖ్య ఆధారంగా ఈవీఎంల కేటాయింపు పూర్తయింది. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 2,554 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా బ్యాలెట్‌ యూనిట్లు కేటాయించారు. అన్ని కేంద్రాల్లో కలిపి 4,376 బ్యాలెట్‌ యూనిట్ల అవసరమని గుర్తించిన అధికారులు ఫస్ట్‌ లెవల్‌ చెకప్‌ పూర్తిచేశాక, నియోజకవర్గ కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు.

లెక్క ఇలా...

ఒక్కో ఈవీఎంలో 16మంది వరకు అభ్యర్థుల పేర్లు నమోదుకు వీలుంటుంది. అలాగే, ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ‘నోటా’కు ఒక నంబర్‌ కేటాయిస్తారు. తద్వారా ఎక్కడైనా 16మంది అభ్యర్థులు ఉండి, నోటా కలిపితే సంఖ్య 17కు చేరడంతో రెండో ఈవీఎం ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని పాలేరులో 38మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా నోటాతో కలిపి 39, ఖమ్మంలో 32మంది పోటీ చేస్తుండగా నోటాతో కలిపి 33కి సంఖ్య చేరుతుంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్‌ స్టేషన్లలో మూడేసి ఈవీఎంలు ఏర్పాటుచేస్తున్నారు. ఇక పినపాక, ఇల్లెందు, సత్తుపల్లి, కొత్తగూడెంలో రెండేసి ఈవీఎంలు, మధిర, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోని పోలింగ్‌ స్టేషన్లలో ఒక్కో ఈవీఎం ఏర్పాటుచేస్తారు.

మరిన్ని వార్తలు