-

పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం..

28 Nov, 2023 13:23 IST|Sakshi
వాగ్వాదానికి దిగిన రంగాకిరణ్‌, లక్కినేని సురేందర్‌రావు

ప్రచారంలో సహకరించడం లేదని లక్కినేని ఆరోపణ

‘కమలం’ జిల్లా అధ్యక్షుడి ఇంట్లో పంచాయితీ..

నిబంధనల మేరకే పని చేస్తున్నామంటున్న కమలదళం!

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య నెలకొన్న ఎన్నికల పొత్తులో కత్తులు విచ్చుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తనకు సహకరించడం లేదని జనసేన అభ్యర్థి ఆరోపణలు చేశారు. ప్రచారం ముగియడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు చేసిన ఈ ఆరోపణలు ఇరు పార్టీ వర్గాల్లో సంచలనంగా మారాయి.

జనసేన జగడం..
జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో గణనీయమైన ప్రభావం చూపే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ గడిచిన ఐదేళ్లుగా వ్యూహాలు రూపొందిస్తోంది. జిల్లాలో ఐదు స్థానాల నుంచి పోటీకి సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో జనసేనతో ఎన్నికల పొత్తు కుదరడంతో కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలు ఆ పార్టీకి కేటాయించారు.

ఈ మేరకు జనసేనతో పాటు బీజేపీ అభ్యర్థుల కోసం స్టార్‌ క్యాంపెయినర్‌ పవన్‌కళ్యాణ్‌ జిల్లాలో ఓ ప్రచార సభలో కూడా పాల్గొన్నారు. ఇక ఒక్క రోజుతో ప్రచార పర్వం ముగుస్తుందనగా ఇరు పార్టీల మధ్య సఖ్యత లేదనే అంశం బట్టబయలైంది. అభ్యర్థిగా నామినేషన్‌ వేసినప్పటి నుంచీ.. బీజేపీ నాయకత్వం తనకు సంపూర్ణ సహకారం అందివ్వడం లేదంటూ కొత్తగూడెం జనసేన అభ్యర్థి లక్కినేని సురేందర్‌ ఆరోపిస్తున్నారు.

ఇదేం పంచాయితీ..?
నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో బూత్‌ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జ్‌లతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కేవీ రంగాకిరణ్‌ ఇంట్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో.. పొత్తు ధర్మం పాటించకుండా తనకు అన్యాయం చేస్తున్నారని లక్కినేని సురేందర్‌ ఏకంగా బీజేపీ జిల్లా నాయకత్వంపై ఆరోపణలు చేశారు. తన తరఫున బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అగర్వాల్‌ ఒక్కరే ప్రచారం చేశారని, అప్పుడు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని అన్నారు.

ఆ తర్వాత అగర్వాల్‌ బీజేపీని వీడి బయటకు వెళ్లారని, అనంతరం ప్రచారంలో బీజేపీ నేతల నుంచి తనకు సరైన సహకారం లేకుండా పోయిందని వాపోయారు. చివరకు తన తరఫున ఎవరైనా ప్రచారంలో పాల్గొన్నా వారిపై బీజేపీ జిల్లా నాయకులు ఒత్తిడి చేసి తనకు దూరం చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్‌కు గడువు దగ్గర పడిన తర్వాత బూత్‌ కమిటీలు వేయడానికి కూడా బీజేపీ నుంచి ఎలాంటి మద్దతు లేదన్నారు. సుజాతనగర్‌ మండలంలో తప్ప మరెక్కడా కమలదళం నుంచి సరైన సాయం అందలేదన్నారు. పొత్తు ధర్మాన్ని అసలు పాటించకుండా తనను బలిపశువు చేశారంటూ విమర్శలు చేశారు.

దబాయింపు సరికాదు!
బీజేపీ పార్టీ నిర్దేశించిన లక్ష్యాలు, నిబంధనలు పాటించడంలో మేము ఎక్కడా పొరపాటు చేయలేదు. అలసత్వం వహించలేదు. పొత్తు ధర్మాన్ని పాటించడంలో పార్టీ అఽధిష్టానం నిర్ణయించిన విధివిధానాల మేరకే పని చేస్తున్నాం. కానీ జనసేన అభ్యర్థి మనసులో వేరే ఉద్దేశాలు, లక్ష్యాలు పెట్టుకుని బీజేపీపై బుదర జల్లుతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు సమావేశంలో ఆయన దబాయించినట్టుగా మాట్లాడటాన్ని, అనుచిత ప్రవర్తనను ఖండిస్తున్నా. – కుంచె వెంకట రంగాకిరణ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

గ్లాసుకు పగుళ్లు..
ఎన్నికల పొత్తులో కొత్తగూడెం సీటు జనసేనకు కేటాయించిన సమయంలో ఆ పార్టీకి ఇక్కడ చెప్పుకోదగ్గ నాయకుడు లేరు. ఆ పార్టీకి జిల్లాలో సంస్థాగత నిర్మాణం లేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అప్పటికే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన లక్కినేని సురేందర్‌ మరోసారి కండువా మార్చి జనసేనలో చేరారు. దీంతో ఆయన ఆ పార్టీ తరఫున కొత్తగూడెం అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. గత రెండు వారాలుగా ‘గ్లాసు గుర్తుకే ఓటెయ్యండి’ అని ప్రచారం కూడా చేశారు. కానీ ఇంతలోనే పరిస్థితులు తారుమారయ్యాయి. సంస్థాగత నిర్మాణం, ప్రణాళిక లేకుండా బరిలో నిలిచిన ‘గాజు గ్లాసు’లో చివరి దశలో పగుళ్లు వచ్చాయి.
ఇవి చదవండి: ఓట్ల వరకే మనుషులు, ఓటర్లు.. ఆ త‌ర్వాత అంతా ఉత్త‌దే! : ఆదివాసీల ఆవేదన

మరిన్ని వార్తలు