-

వైభవంగా కృత్తికా దీపోత్సవం..

28 Nov, 2023 00:32 IST|Sakshi
ఉమామహేశ్వర ఆలయంలో అభిషేకం చేస్తున్న దృశ్యం
● రామయ్యకు కనులపండువగా స్నపన తిరుమంజనం ● పోటెత్తిన భక్త జనం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం స్వామివారికి కనుల పండువగా కృత్తికా దీపోత్సవం నిర్వహించారు. తొలుత తిరుమంగై ఆళ్వార్‌ తిరునక్షత్రోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్సవ మూర్తులను, ఆళ్వార్‌లను పల్లకీ సేవగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివార్లకు 25 కలశాలతో స్నపన తిరుమంజనం, పంచామృతాలతో అభిషేకం జరిపించారు. అనంతరం హారతి సమర్పించారు. కృత్తికాదీపోత్సవం సందర్భంగా సాయంత్రం హోమ గుండం నుంచి తీసుకొచ్చిన జ్వాలతో దీపాలను వెలిగించారు. పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం రామాలయంలో కృత్తికా దీపోత్సవం నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా చొక్కాసుర వధ, దహనం, తిరువీది సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల నేపథ్యంలో రామయ్య నిత్యకల్యాణాన్ని సోమవారం నిలిపివేశారు.

ఆలయానికి పోటెత్తిన భక్తులు..

కార్తీక పౌర్ణమి సోమవారం రావడంతో భక్తులు పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత స్వామివారి దర్శనానికి రామాలయానికి పోటెత్తారు. ఆలయంలో నిర్వహించిన సత్యనారాయణ వ్రతాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు. రామాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగఉమామహేశ్వర ఆలయంలో శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.

మరిన్ని వార్తలు