-

●నేటితో ముగియనున్న ప్రచారం

28 Nov, 2023 00:32 IST|Sakshi

కొత్తగూడెంఅర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. చివరి రోజు ఆయా పార్టీలకు ప్రాబల్యం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని ప్రచారం చేసేందుకు ఆయా నాయకులు రంగం సిద్దం చేస్తున్నారు. ఇక నేటి రాత్రి నుంచి ఓటర్లను ప్రభావితం చేసే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి దాదాపు 50 రోజుల పాటు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోయారు. ప్రచార రథాలకు మైక్‌లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పార్టీల వారు విస్తృతంగా పర్యటించారు.

అగ్రనేతల ఆగమనంతో..

ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ఆయా పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు ప్రచారం నిర్వహించారు. దీంతో కేడర్‌లో కొంత జోష్‌ వచ్చింది. బీఆర్‌ఎస్‌ నుంచి సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభలకు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల తరఫున పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ మణుగూరులో రోడ్‌షో నిర్వహించగా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం నిర్వహించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం అగ్ర నాయకులు సీతారాం ఏచూరి, బృందాకారత్‌, మాణిక్‌సర్కార్‌, విజయరాఘవన్‌ వంటి వారు ప్రచారంలో పాల్గొన్నారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున పవన్‌కళ్యాణ్‌, ఈటల రాజేందర్‌ జిల్లాలో పర్యటించారు.

‘గూడెం’, భద్రాద్రిలో

త్రిముఖ పోటీ..

కొత్తగూడెం నియోజవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ నుంచి జలగం వెంకట్రావు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వీరి ముగ్గురి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. భద్రాచలంలోనూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఎం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటల్లో మాత్రం బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండనుంది.

మరిన్ని వార్తలు