-

తటస్థ ఓటర్లపై దృష్టి

28 Nov, 2023 00:32 IST|Sakshi

ఇల్లెందురూరల్‌: ఇప్పటివరకు ముమ్మరంగా ప్రచారం చేసిన అభ్యర్థులు ఇక తటస్థ ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక నేతల నడుమ సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. అన్ని రాజకీయ పక్షాలు వలసలపై ప్రధానంగా దృష్టి సారించగా, ఇతర పార్టీల నుంచి చేరికలు జరిగాయి. దీంతో పాత నేతలు, కార్యకర్తలు అంతర్గత చర్చల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, అభ్యర్థులు వారి ఇళ్లకు వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి భవిష్యత్‌కు భరోసా ఇస్తూ, పాత కొత్త నేతలను సమన్వయం చేసుకుంటున్నారు. పార్టీలో చేరడం.. అదే రోజు రాత్రో, మరుసటి రోజూ మళ్ళీ కండువా మార్చడం.. వంటి పరిణామాలు అభ్యర్థులను అభద్రతకు గురిచేస్తున్నాయి. ప్రచారంలో ఎదురవుతున్న చేదు అనుభవాలను సైతం అభ్యర్థులు కోవర్టు ఆపరేషన్‌గా పరిగణిస్తూ నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతలను సమన్వయం చేయాలని ప్రధాన పార్టీలు ఇన్‌చార్జీ లను నియమించినా వారి పాత్ర ఇల్లెందులో అంతగా కనిపించడం లేదు. అభ్యర్థులు తమ సొంత అనుయాయులతో పరిస్థితి చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలో మండలాల వారీగా సామాజిక లెక్కలను బేరీజు వేసుకుంటూ, కులసంఘాల ప్రతినిధులను మచ్చిక చేసుకుంటున్నారు. కార్తీకమాసం కూడా కలిసి రావడంతో వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు, కార్మిక సంఘాలు తదితర సమూహాలతో సైతం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి చర్చలు జరుపుతున్నారు. బూత్‌ల వారీగా ఓట్ల లెక్కలు తీస్తూ, తమకే ఎక్కువ పడేలా, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారిని రప్పించేలా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తైతే, చివరి రెండు రోజులు మరో ఎత్తుగా భావిస్తూ తాయిలాల పంపకాన్ని ఆయా పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు