లారీ ఢీకొని వ్యాపారి దుర్మరణం

29 Nov, 2023 00:22 IST|Sakshi

అశ్వారావుపేటరూరల్‌: లారీ ఢీకొని ఓ వ్యాపారి దుర్మరణం చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. అశ్వారావుపేటలోని నందమూరినగర్‌కు చెందిన బట్టల వ్యాపారం చేసే సోమలంక సత్యనారాయణ (60) ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వెళ్లి బట్టలు కొనుగోలు చేసి తిరిగి వచ్చాడు. రోడ్డు దాటి తన ఇంటికి వెళ్లేందుకు నిలబడిన సమయంలో సత్తుపల్లి వైపు నుంచి జంగారెడ్డిగూడేనికి వెళ్తున్న బొగ్గు లారీ అదుపుతప్పి ఢీకొట్టి, అతడి పైనుంచి వేగంగా దూసుకెళ్లింది.

దీంతో సత్యనారాయణ శరీరం పొట్ట భాగం నుంచి కిందకు నుజ్జునుజ్జు అవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శివరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సరిహద్దు చెక్‌ పోస్టు ముట్టడి..

కాగా, వారం రోజుల వ్యవధిలో ఇదే ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, కాలనీవాసులు సరిహద్దు చెక్‌ పోస్టు వద్ద ఆందోళన చేపట్టారు. వాహనాలు వేగంగా దూసుకొస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో వారంతా వెనుతిరిగారు.

మరిన్ని వార్తలు