రాజకీయ.. ‘ఉపాధి’ ఆగింది!

29 Nov, 2023 00:22 IST|Sakshi
ప్రచారంలో డప్పు కళాకారులు
● పక్షం రోజులు ప్రచారంలో పాల్గొన్న కూలీలు ● మైకులు, డీజే, బ్యాటరీ రీచార్జ్‌ దుకాణాలకు భలే గిరాకీ ● గిరగిరా తిరిగిన ఆటోలు, ట్రాలీలు

ఇల్లెందురూరల్‌: అసెంబ్లీ ఎన్నికలు వేళ పార్టీల కార్యకర్తలు, నాయకులకు ఎలా ఉన్నా కూలీలు, డ్రైవర్లు, హోటల్‌ యజమానులు, కళాకారులు, చిరు వ్యాపారులకు మాత్రం మంచి ప్రయోజనాన్ని చేకూర్చాయి. పక్షం రోజులపాటు ఆయా వర్గాలను ఆదుకున్న రాజకీయ ఉపాధి మంగళవారంతో ఆగిపోయింది. నామినేషన్ల గడువు ముగిసిన నాటి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారంలో రోజువారీ కూలీలను వినియోగించుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కూలీలు ప్రచారంలో పాల్గొనగా.. ప్రతిరోజు వారికి భోజనం, మద్యంతో డబ్బులు కూడా ఇచ్చారు. దీంతో చాలా మంది రోజువారీ పనులు వదిలేసి ప్రచారానికే పరిమితమయ్యారు. దీంతో కూలీలకు రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు ఇచ్చినట్లుగా సమాచారం.

అన్నింటికీ గిరాకీ

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారంలో కూలీలతోపాటు ప్రచార రథాలు, డప్పులు, మైకులు, కరపత్రాలను వినియోగించారు. దీంతో ఆటోవాలా, టాటా ఏసీ, ట్రాలీలకు గిరాకీ ఏర్పడింది. వాహనాలకు మూడు వైపులా ఫ్లెక్సీలను బిగించి మైకులతో ప్రచారం సాగించారు. ప్రతిరోజు ఆటోకు డీజిల్‌ పోసి రూ.500నుంచి రూ.700వరకు చెల్లించారు. ప్రచార రథాలకు అన్ని హంగులు కల్పించి 15రోజులపాటు అద్దె ప్రాతిపదికన రూ.30వేలు వరకు చెల్లించారు. అలాగే, కార్లు, ఇతర వాహనాలకు రోజుకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, డప్పు కోసం రూ.3వేల నుంచి రూ.పది వేల వరకు ఖర్చు చేయడమేకాక షామియానాలు, భోజనాలు, మందు పంపిణీకి డబ్బు వెచ్చించారు. దీంతో హోటళ్లు, క్యాటరింగ్‌ సంస్థల నిర్వాహకులకు కూడా నగదు సమకూరింది. ఇక ప్రచారంలో పాల్గొన్న డబ్బు కళాకారులు, గాయకులకు 15రోజుల పాటు ఉపాధి లభించింది. అభ్యర్థులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖర్చు విషయంలో రాజీ పడకపోవడంతో చాలా మందికి బిజీబిజీగా గడపడమే కాక నాలుగు రూపాయిలు సంపాదించుకున్నారు.

మరిన్ని వార్తలు