వివాహిత ఆత్మహత్య

29 Nov, 2023 00:24 IST|Sakshi
ధ్వంసమైన మిర్చితోట

అశ్వారావుపేటరూరల్‌: అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ వివాహిత పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ పి.శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల కేంద్రానికి చెందిన పొడియం సునీత (23) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని దురదపాడు గ్రామానికి చెందిన సున్నం శ్రీనును నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఏడాది గడిచిన తరువాత భర్తతోపాటు అత్త పొడియం దుర్గ, మామ రామయ్య కలిసి అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారు. వేధింపులు రోజురోజుకూ పెరిగిపోవడంతో భరించలేక సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబీకులు తక్షణమే అశ్వారావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం జరిపించి, అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతురాలి తండ్రి పొడియం వెంకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మిర్చి తోట ధ్వంసం

ఇల్లెందురూరల్‌: మండలంలోని ముత్తారపుకట్ట గ్రామపంచాయతీ వీరాపురం గ్రామానికి చెందిన బానోత్‌ రాందాస్‌కు చెందిన ఎకరంన్నర మిర్చితోటను గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం పూర్తిగా ధ్వంసం చేశారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే రాందాస్‌ తనకు ఉన్న ఎకరంన్నర తోటలో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం మిర్చి కాతకు రావడంతో ఆనందంతో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో చేతికందుతుందన్న దశలో గుర్తు తెలియని వ్యక్తులు చేనులోని మొక్కలన్నింటిని కాండం భాగంలో విరగగొట్టారు. రోజుమాదిరిగానే ఉదయం చేను వద్దకు వెళ్లిన రాందాస్‌ జరిగిన నష్టాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. గ్రామస్థుల సహకారంతో ఇల్లెందు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాతకు వచ్చిన చేను పూర్తిగా ధ్వంసం కావడంతో రైతు రాందాస్‌కు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు తెలిపారు.

మద్యం దుకాణాలపై నిఘా

కొత్తగూడెంఅర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 30వ తేదీ సాయంత్రం వరకు జిల్లాలోని అన్ని మద్యం దుకాణాలు, బార్లు, కల్లు డిపోలు మూసేయాలని జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి జానయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సిబ్బంది పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. మద్యం దుకాణాలు తెరిచినా, మరే ఇతర ఫిర్యాదులు ఉన్నా 08744–242464 నంబర్‌కు ఫోన్‌ చేసి తెలపాలని ప్రజలను కోరారు.

మరిన్ని వార్తలు