భద్రత కట్టుదిట్టం..

29 Nov, 2023 00:24 IST|Sakshi
చర్ల నుంచి సరిహద్దు గ్రామాలకు తరలివెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ బలగాలు
● సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసు యంత్రాంగం ● అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కూంబింగ్‌ ఆపరేషన్‌

చర్ల: తెలంగాణలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ఉండేలా సరిహద్దులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రెండు రోజులుగా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాలకు చేరుకుంటున్న బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. సరిహద్దులో ఉన్న పూసుగుప్ప, వద్దిపేట, చెన్నాపురం, చెలిమెల, తిప్పాపురం, తోగ్గూడెం సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులకు అదనపు బలగాలను తరలించి భద్రతను కట్టుదిట్టం చేశారు. చర్ల మండల సరిహద్దు గ్రామాలైన కుర్నపల్లి, బోదనెల్లి, కొండెవాయి, పులిగుండాల, ఎర్రంపాడు, చెన్నాపురం, బత్తినపల్లి, తిప్పాపురం, ఉంజుపల్లి, వద్దిపేట, పూసుగుప్ప గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ పార్టీ, కోబ్రా, ఎస్‌టీఎఫ్‌ బలగాలు ముమ్మరంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. మండలం నుంచి సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంత గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులలో స్పెషల్‌ పార్టీ పోలీసులు వచ్చి పోయే వారిని నిశితంగా తనిఖీ చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గ్రామాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు