పోలింగ్‌ కేంద్రాల కేటాయింపులో తప్పు

29 Nov, 2023 00:24 IST|Sakshi
ఆసుపాక పోలింగ్‌ కేంద్రం కేటాయించిన ఓటరు స్లిప్పు

అశ్వారావుపేటరూరల్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పోలింగ్‌ కేంద్రాల కేటాయింపుల్లో తప్పు దొర్లింది. అశ్వారావుపేటలోని పోస్టాఫీస్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న కాకి పవన్‌కుమార్‌కు ఇటీవలె కొత్తగా ఓటు హక్కు వచ్చింది. తుది జాబితాలో స్థానిక ఓటరుగా నమోదు చేసి అశ్వారావుపేటలో గల పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించాల్సి ఉంది. కానీ, పవన్‌కుమార్‌కు దాదాపు 20 కిలో మీటర్ల దూరంలోని మండలంలో ఆసుపాక గ్రామంలోని ఓటరు జాబితాలో క్రమ సంఖ్య 206 కింద నమోదు చేసి, ప్రభుత్వ మండల పరిషత్‌ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం నంబరు 144ను కేటాయించడం విశేషం. దీంతో ఈ నెల 30వ తేదీన సదరు యువకుడు ఆసుపాక వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఓటర్లకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటరుస్లిప్పులు అందించాల్సి ఉండగా, నేటికీ చాలా మంది ఓటర్లకు స్లిప్పులు అందలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమందికి ఓటరు కార్డులు ఉన్నప్పటికీ, తాజా జాబితాలో పేర్లు గల్లంతైనట్లు వాపోతున్నారు. స్థానిక ఏఆర్‌ఓ కృష్ణప్రసాద్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఓటరు నమోదు సమయంలోనే తప్పుగా నమోదు చేసి ఉంటారని, పోలింగ్‌ తర్వాత ఫాం–8 ద్వారా అశ్వారావుపేటకు మార్పు చేస్తామని తెలిపారు. ఈ సారికి ఓటు ఆసుపాక పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి వేయాల్సిందేనన్నారు.

మరిన్ని వార్తలు