ష్‌... గప్‌చుప్‌ !

29 Nov, 2023 00:24 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల హడావుడి చివరి దశకు చేరుకుంది. పల్లె, పట్నం, ఊరూ వాడా తేడా లేకుండా తీరిక లేకుండా సాగిన ప్రచారం మంగళవారం సాయంత్రం 4 గంటలతో ముగిసిపోయింది. ఆ తర్వాత చేయాల్సిన ఎన్నికల ఏర్పాట్లలో పార్టీలు, అభ్యర్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు మునిగిపోయారు.

కేసీఆర్‌ సభలతో బీఆర్‌ఎస్‌ ముందంజ..

మిగిలిన రాజకీయ పార్టీల కంటే ముందుగానే భారత రాష్ట్ర సమితి ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేయకముందే ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ జిల్లాలో ప్రచారం ప్రారంభించారు. నవంబర్‌ 1న ఇల్లెందు, 5న కొత్తగూడెంలలో నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. నామినేషన్లు ముగిసిన తర్వాత నవంబర్‌ 13న పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కేటీఆర్‌ సైతం జిల్లాలో రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. అందులో భాగంగా ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, అశ్వారావుపేటలో ప్రచారం నిర్వహించారు. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఐతో పోలిస్తే ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్‌ ముందు వరుసలో నిలిచింది.

రాహుల్‌ రాకతో ‘హస్తం’లో జోష్‌..

హడావుడి లేకపోయినా సంప్రదాయ ఓటు బ్యాంకు అండతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావవంతంగా ప్రచారం నిర్వహించింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు నామినేషన్ల చివరి దశ వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీలో తర్జనభర్జనలు జరిగాయి. దీంతో బీఆర్‌ఎస్‌, బీజేపీతో పోలిస్తే ప్రచారంలో ఆ పార్టీ వెనుకబడినట్టు ఆదిలో కనిపించింది. కానీ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పినపాకలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌తో కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్‌ వచ్చింది. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహాల్లా పార్టీ శ్రేణులు ప్రచారంలో దూకాయి. దీంతో స్టార్‌ క్యాంపెయినర్ల హడావుడి లేకపోయినా పీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశంలో తక్కువ సమయంలోనే కాంగ్రెస్‌ జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది. పొత్తులో భాగంగా సీపీఐ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేస్తున్న కూనంనేని సాంబశివరావుకు మద్దతుగా ప్రియాంకగాంధీ ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయ్యింది. ఇదే తీరుగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ కూడా ఇల్లెందు సభకు రాలేకపోయారు.

ప్రత్యేకత చాటిన ఇతర పార్టీలు, స్వతంత్రులు..

ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు తోడు బహుజన్‌ సమాజ్‌ పార్టీ, సీపీఎం, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీలతో పాటు స్వంతంత్ర అభ్యర్థులు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహించి ప్రత్యేకత చాటారు. ముఖ్యంగా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి కొత్తగూడెంలో జలగం వెంకటరావు ప్రచారంలో ప్రధాన పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. బీఎస్‌పీ అభ్యర్థి యెర్రా కామేశ్‌ సైతం చెమటోడ్చారు. వీరితో పాటు ఇల్లెందులో చీమల వెంకటేశ్వర్లు, పినపాకలో ఊకే ముద్దరాజు, కొత్తగూడెంలో ఇమంది ఉదయ్‌ తదితరులు విస్తృత ప్రచారం నిర్వహించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్‌, జనసేన నుంచి పవన్‌కళ్యాణ్‌ ఆయా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు.

ముగిసిన ఎన్నికల ప్రచారం

దూకుడు ప్రదర్శించిన బీఆర్‌ఎస్‌

కాంగ్రెస్‌ తరఫున జిల్లాకు వచ్చిన అగ్రనేత రాహుల్‌

శక్తివంచన లేకుండా పర్యటించిన స్వతంత్రులు

మూగబోయిన మైకులు..

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది మొదలు ప్రచార సందడి ప్రారంభమైంది. ముఖ్యంగా ఈనెల 3 నుంచి నామినేషన్ల స్వీకారం మొదలవడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఆ తర్వాత స్క్రూట్నీ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించిన తర్వాత ఆకాశమే హద్దుగా అభ్యర్థులు ప్రచారం చేశారు. డోర్‌ టూ డోర్‌, జీపు జాతాలు, ప్రత్యేక ఎన్నికల వాహనాలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, సోషల్‌ మీడియా ఇలా అందుబాటులో ఉన్న ప్రతీ మార్గంలో ప్రచారాన్ని హోరెత్తించారు. క్షణం తీరిక లేకుండా ప్రచార వాహనాలు రోడ్లపై చక్కర్లు కొట్టాయి. చెవులకు చిల్లులు పడతాయా అన్నట్టుగా అభ్యర్థులు, ఆయా పార్టీల తరఫున రూపొందించిన ప్రత్యేక గీతాలు మార్మోగాయి. డీజే చప్పుళ్లు సందడి చేశాయి. మరోవైపు రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలు సైతం అంతే ఆసక్తి చూపించారు. పనులు మానుకుని రోడ్‌షోలు, బహిరంగ సభలకు హాజరయ్యారు. ఇలా సభలకు వచ్చే ప్రజలు ఉపాధి కోల్పోకుండా తగు మొత్తాలను పార్టీలు సైతం చెల్లించాయి.

మరిన్ని వార్తలు