నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం

29 Nov, 2023 00:24 IST|Sakshi
నిత్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

భద్రాచలంటౌన్‌: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిచారు. మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.

ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి

కొత్తగూడెంటౌన్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, ప్రజలు ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైనదని, ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా డబ్బు, మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.3,09,70,240 నగదు, రూ.19,80,486 విలువైన 1,820 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు.

మరిన్ని వార్తలు