హీరో నుంచి హీరో వస్తాడు

18 Jan, 2021 09:10 IST|Sakshi

దిలీప్‌ కుమార్‌ను చూసి సినిమా హీరో అవుదామనుకుని హీరోలు అయినవారు ధర్మేంద్ర, మనోజ్‌ కుమార్‌. తెలుగులో చిరంజీవిని చూసి హీరో అవుదామనుకుని అయిన శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ షారూక్‌ ఖాన్‌ను చూసి తాను హీరోనయ్యానని చెప్పుకున్నాడు. రాజ్‌ కుమార్‌ రావు ఇటీవల ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌పై డ్రిల్‌ టీచర్‌ పాత్రలో ‘ఛలాంగ్‌’ సినిమాతో ముందుకు వచ్చాడు. కాని ఆ సినిమా అనుకున్నంత రెస్పాన్స్‌ పొందలేదు. దీని తర్వాత అతను నటించిన ‘వైట్‌ టైగర్‌’ విడుదలైంది. అరవింద్‌ అడిగ నవల ‘వైట్‌ టైగర్‌’ ఆధారంగా అమెరికా ప్రేక్షకుల కోసం ఇంగ్లిష్‌లో తీసిన ఈ సినిమాను  హిందీలో డబ్‌ చేసి జనవరి 13న థియేటర్లలో విడుదల చేశారు.

గతంలో వచ్చిన స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాలో ఉండే కొన్ని నెగెటివ్‌ అంశాలకు ‘వైట్‌ టైగర్‌’ సరైన సమాధానం చెప్పిందన్న ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు జనవరి 22న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. రాజ్‌కుమార్‌ రావు గుర్‌గావ్‌ నుంచి వచ్చిన నటుడు. ‘నేను షారూక్‌ ఖాన్‌ సినిమాలను చూసే నటుడవుదామనుకున్నాను. ఆయన సినిమా రంగంలో పని చేస్తుండగా ఆయనతో పాటు నేను కూడా పని చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నీ దగ్గర కష్టపడే స్వభావం ఉంటే సక్సెస్‌ కావచ్చన్న దానికి షారూక్‌ జీవితమే ఉదాహరణ. నేను కూడా ఆయనలాగే కష్టపడ్డాను’ అని చెప్పాడు రాజ్‌కుమార్‌ రావ్‌. ‘స్త్రీ’ తర్వాత రాజ్‌కుమార్‌ రావ్‌కు గట్టి హిట్‌ తగల్లేదు. ప్రస్తుతం అతను ‘బధాయీ దో’ సినిమాలో నటిస్తున్నాడు. 

మరిన్ని వార్తలు