రూ. లక్ష కోట్ల ‘పన్ను’ పరిష్కారం

4 Jan, 2021 05:59 IST|Sakshi

వివాద్‌ సే విశ్వాస్‌ పథకానికి మంచి స్పందన

న్యూఢిల్లీ: ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పన్ను వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వివాద్‌ సే విశ్వాస్‌’ పథకానికి మంచి స్పందన లభించింది. ఆదాయపన్ను శాఖతో పన్ను వివాదాలు నెలకొన్న 5 లక్షల యూనిట్లలో సుమారు లక్ష యూనిట్లు (సంస్థలు/పరిశ్రమలు) వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని ఎంపిక చేసుకున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్‌భూషణ్‌ పాండే తెలిపారు. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఆదాయపన్ను శాఖతో నెలకొన్న వివాదాల పరిష్కారానికి వివాద్‌ సే విశ్వాస్‌ పథకాన్ని 2020–21 బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

పలు అప్పిలేట్‌ వేదికల వద్ద 4.8 లక్షల అప్పీళ్లు పరిష్కారాల కోసం వేచి చూస్తుండగా.. వీటికి సంబంధించి రూ.9.32 లక్షల కోట్లు బ్లాక్‌ అయి ఉన్నాయి. ఇలా అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో 96,000 (రూ.83,000 కోట్లు) ఈ పథకాన్ని ఎంపిక చేసుకున్నాయి. డిసెంబర్‌తోనే ఈ పథకానికి గడువు ముగిసిపోనుండగా.. కేంద్రం జనవరి 31 వరకు పొడిగించింది. ఈ పథకాన్ని ఎంచుకున్న సంస్థలు అవసరమైన మేర పన్ను చెల్లించినట్టయితే ఆ వివాదానికి అంతటితో ఆదాయపన్ను శాఖ ముగింపు పలుకుతుంది. అంతేకాదు న్యాయపరమైన చర్యలు కూడా చేపట్టదు. రూ.లక్ష కోట్లకు పైగా పన్ను డిమాండ్లను తప్పుడు ఎంట్రీ (చేర్చడం) కారణంగా వచ్చినవని గుర్తించి పరిష్కరించినట్టు పాండా చెప్పారు.

కఠిన చర్యల వల్లే జీఎస్‌టీ ఆదాయంలో వృద్ధి
డేటా విశ్లేషణ, ఏజెన్సీల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా జీఎస్‌టీ ఎగవేతలను అడ్డుకునే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్టు పాండే చెప్పారు. ఇందులో భాగంగా 7,000కు పైగా సంస్థలపై చర్యలు మొదలయ్యాయని, 187 మందిని అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. ఈ చర్యల ఫలితమే ఆదాయం పెరుగు దలన్నారు. 2020 డిసెంబర్‌లో జీఎస్‌టీ ఆదాయం రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిన విషయం తెలిసిందే. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలలో నమోదైన అత్యధిక ఆదాయం ఇదే కావడం గమనార్హం. నకిలీ బిల్లుల రాకెట్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం వల్ల 187 మంది అరెస్ట్‌ అయ్యారని, వీరిలో ఐదుగురు చార్టర్డ్‌ అకౌంటెంట్లు ఉన్నట్టు పాండే తెలిపారు. కొంత మంది ఎండీలు కూడా 40–50 రోజుల నుంచి జైలులోనే ఉండిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు