ఒక్క బ్యాంక్‌ కోసం ముందుకొచ్చిన 11 బ్యాంక్‌లు.. కారణం అదేనా

17 Mar, 2023 20:33 IST|Sakshi

అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ మూసివేత తర్వాత మరిన్ని బ్యాంక్‌లు అదే దారిలో ఉన్నాయనే వార్తలు ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఈ నేపథ్యంలో అమెరికాలో 11 బడా బ్యాంకులు ఏకతాటిపైకి వచ్చాయి. మరో భారీ సంక్షోభం రాకుండా పతనం అంచుల్లో ఉన్న ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు 30 బిలియన్‌ డాలర్ల ప్యాకేజీని ప్రకటించాయి.

డిసెంబరు 31 నాటికి ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకులో 176.4 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయి. అయితే, కుప్పుకూలిపోతున్న బ్యాంకులు, విశ్లేషకుల అంచనాలు, ఇతర పరిణామాలతో ఖాతాదారులు ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ నుంచి నగదును ఉపసంహరించుకుంటున్నారు. దీంతో సదరు బ్యాంక్‌లో నగదు సమస్య ఏర్పడి బ్యాంక్‌ దివాలా తీయొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జేపీ మోర్గాన్‌ చేజ్‌, బ్యాంక్ ఆఫ్‌ అమెరికా, సిటీ గ్రూప్‌, వెల్స్‌ ఫార్గో, మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మన్‌ శాక్స్‌, బీఎన్‌వై మెలన్‌, స్టేట్‌ స్ట్రీట్‌, పీఎన్‌సీ బ్యాంక్‌, ట్రుయిస్ట్‌, యూఎస్‌ బ్యాంకులన్నీ ఏకమై ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి.

ఖాతాదారులందరూ బిలియనీర్లే 
ఇక ఫస్ట్‌ రిపబ్లిక్‌లో ఎక్కువ మంది బిలియనీర్లే ఖాతాదారులుగా ఉన్నట్లు సమాచారం. వారిలో మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ సైతం ఈ బ్యాంకు నుంచి తనఖా రుణం తీసుకున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు