ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది

23 Dec, 2021 08:49 IST|Sakshi

అక్టోబర్‌ గణాంకాలు విడుదల 

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కిందకు అక్టోబర్‌లో కొత్తగా 12.73 లక్షల మంది వచ్చి చేరారు. 2020లో ఇదే నెలలో గణాంకాలతో పోలిస్తే సభ్యుల చేరికలో 10.22 శాతం వృద్ధి నమోదైంది. 2020 అక్టోబర్‌లో కొత్త సభ్యుల సంఖ్య 11.55 లక్షలుగా ఉంది. కార్మిక శాఖ ఈ మేరకు సోమవారం వివరాలను వెల్లడించింది. 

‘‘అక్టోబర్‌లో కొత్త సభ్యులు 12.73 లక్షల మందిలో.. 7.57 లక్షల మంది ఈపీఎఫ్‌ అండ్‌ ఎంపీ యాక్ట్‌ 1952 కింద మొదటి సారి చేరారు. సుమారు 5.16 లక్షల మంది చేస్తున్న సంస్థల నుంచి బయటకు వెళ్లిపోయి, కొత్త సంస్థల్లో చేరిన వారు. వీరు తమ ఈపీఎఫ్‌ ఖాతాలను బదిలీ చేసుకున్నారు. కొత్త సభ్యుల్లో 22–25 వయసులోని వారు 3.37 లక్షల మంది కాగా.. 18–21 సంవత్సరాల వయసులోని వారు 2.50 లక్షల మంది ఉన్నారు. అంటే కొత్త సభ్యుల్లో వీరే 46 శాతంగా ఉన్నారు. అదే విధంగా మొత్తం కొత్త సభ్యుల్లో 60.64 శాతం అంటే సుమారు 7.72 లక్షల మంది మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి నమోదయ్యారు’’ అని తెలిపింది. 
 

చదవండి:ఈ-నామినేషన్ ఫైల్ చేయకపోతే.. ఈపీఎఫ్ ప్రయోజనాలు బంద్?

మరిన్ని వార్తలు