డీమ్యాట్‌ ఖాతాల జోరు

30 Dec, 2020 03:26 IST|Sakshi

 మార్కెట్లో రికార్డ్‌ల హోరు

జూన్‌ నుంచి 10 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు జత

వరుసగా ఐదో నెలలో కూడా ఇదే జోరు 

స్టాక్‌ మార్కెట్‌ రికవరీతో పెరుగుతున్న డీమ్యాట్‌ ఖాతాలు 

భవిష్యత్తులో కూడా ఇదే జోరు  ఉండగలదంటున్న నిపుణులు

స్టాక్‌ మార్కెట్‌ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్‌ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్‌లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. నెలకు  పది లక్షలకు పైగా కొత్త డీమ్యాట్‌ ఖాతాలు ఆరంభం కావడం ఇది వరుసగా ఐదో నెల. సెప్టెంబర్‌లో రికార్డ్‌ స్థాయిలో  కొత్తగా 13 లక్షల డీమ్యాట్‌ ఖాతాలు జత అయ్యాయి. దీంతో అక్టోబర్‌ చివరినాటికి మొత్తం డీమ్యాట్‌ ఖాతాల సంఖ్య 4.76 కోట్లకు చేరింది.  గత ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు జత కాగా, ఈ ఆర్థిక  సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు అరకోటి డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. గత దశాబ్దకాలంలో ఇదే అత్యధికం. కొత్తగా మొదలైన డీమ్యాట్‌ ఖాతాల్లో 90 శాతానికి పైగా యువజనులవే ఉండటం విశేషం.

వరంలా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనడానికి  కేంద్రం లాక్‌డౌన్‌నును విధించడం తెలిసిందే. దీంతో పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ను ఇచ్చాయి. దీంతో పలువురు ఇంటివద్దే ఉండిపోవడంతో స్టాక్‌ మార్కెట్లో ఓ చేయి వేసి చూద్దామనే భావన పెరిగిపోయింది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగాయి. మరోవైపు కరోనా కల్లోలం నుంచి స్టాక్‌ మార్కెట్‌ త్వరగానే కోలుకుంది. మార్చిలో కనిష్ట స్థాయి పతనం నుంచి చూస్తే దాదాపు 77 శాతం ఎగసింది. కొత్త ఇన్వెస్టర్ల జోరుతో మొబైల్‌ ట్రేడింగ్‌ కూడా బాగా పెరిగింది. మొత్తం ట్రేడింగ్‌ లావాదేవీల్లో మొబైల్‌ ట్రేడింగ్‌ లావాదేవీలు ఈ నవంబర్‌లో 18.5 శాతానికి పెరిగాయి. ఇది రికార్డ్‌ స్థాయి.

మరింత ముందుకే
తయారీ, సేవల రంగాల గణాంకాలు క్రమక్రమంగా పుంజుకోవడం, కంపెనీల సెప్టెంబర్‌ క్వార్టర్‌ గణాంకాలు అంచనాలను మించడం, కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు వెల్లువెత్తడం.. ఈ కారణాలన్నింటి వల్ల స్టాక్‌మార్కెట్‌ జోరుగా పెరిగింది. రానున్న నెలల్లో కూడా మార్కెట్‌  జోరు మరింతగా పెరగనున్నదని నిపుణులు అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం, ప్రభుత్వ, ఆర్‌బీఐ చర్యలు తదితర అంశాలు దీనికి కారణం. మార్కెట్‌ జోరు ఇలానే కొనసాగితే డీమ్యాట్‌ ఖాతాలు మరింతగా పెరుగుతాయని అంచనా. అమెరికాలో ఆ దేశ జనాభాతో పోల్చితే కనీసం 10% గా డీమ్యాట్‌ ఖాతాలుంటాయని, భారత్‌లో అర శాతం కూడా లేవని నిపుణులంటున్నారు.

ఐదోరోజూ అదే పరుగు
13,900 పైన నిఫ్టీ ముగింపు ∙సెన్సెక్స్‌ లాభం 259 పాయింట్లు
బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో మార్కెట్‌ ఐదోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 259 పాయింట్లను ఆర్జించి 47,613 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 13,933 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, దేశీయ ఈక్విటీల్లోకి నిర్విరామంగా కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు సూచీల ర్యాలీకి మద్దతుగా నిలిచాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ షేర్లు లాభపడ్డాయి. మెటల్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 47,715 వద్ద, నిఫ్టీ 13,968 వద్ద కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను నమోదు చేశాయి. బ్రెగ్జిట్‌ ఒప్పందం, యూఎస్‌ ఉద్దీపన ప్యాకేజీ అనుమతుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో కదలాడాయి. రూపాయి విలువ 7 పైసలు బలపడి 73.42 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ప్రభావితం చేయగల అంతర్జాతీయ అంశాలేవీ లేకపోవడంతో త్వరలో విడుదల కానున్న కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, స్టాక్‌ ఆధారిత అప్‌డేట్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టే అవకాశం ఉందని స్టాక్‌ నిపుణులు భావిస్తున్నారు.

రూ.లక్ష కోట్ల క్లబ్‌లోకి బజాజ్‌ ఆటో...  
ఆటో దిగ్గజ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ ఇంట్రాడేలో రూ.లక్ష కోట్లను తాకింది. ఈ ఘనత సాధించిన నాలుగో ఆటోమొబైల్‌ సంస్థగా బజాజ్‌ ఆటో రికార్డును సృష్టించింది. ఇంతకుముందు మారుతి సుజికీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌ ఈ జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. షేరు అరశాతం లాభంతో రూ.3,431 వద్ద స్థిరపడింది.

>
మరిన్ని వార్తలు