Mexico Chopper Crash: హెలికాప్టర్‌ కూలి 14 మంది మృతి: నార్కో టెర్రరిస్టు అరెస్టే కారణమా?

16 Jul, 2022 11:01 IST|Sakshi

మెక్సికో : సినాలోవాలో మెక్సికన్ నేవీ హెలికాప్టర్ కూలిన ఘటన విషాదాన్ని నింపింది.  ఉత్తర రాష్ట్రమైన సినాలోవాలో బ్లాక్ హాక్ మిలిటరీ హెలికాప్టర్ కూలిపోవడంతో 14 మంది మరణించారని, మరొకరు గాయపడ్డారని మెక్సికన్‌ నేవీ శుక్రవారం తెలిపింది.  ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరుగుతోందని  తెలిపింది. నావీ మోస్ట్‌ వాంటెడ్‌ నార్కో టెర్రరిస్టును అదుపులోకి  తీసుకున్న నేపథ్యంలోనే ఈ క్రాష్‌ జరిగి ఉంటుందా అనే అనుమానాలు  వెల్లువెత్తాయి.

సినాలోవాలో  69 ఏళ్లడ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరో మాక్స్ అనే మిలిటరీ-శిక్షణ పొందిన ఫీమేల్ బ్లడ్‌హౌండ్‌కి పట్టుబడ్డాడని నేవీ శుక్రవారం తెలిపింది. అతని అరెస్టు తరువాత  హెలికాప్టర్‌ క్రాష్‌ కావడం చర్చకు దారితీసింది. అయితే అతని అరెస్టకు ఈ ప్రమాదానికి  సంబంధం ఉందన్న సమాచారం ఏమీ లేదని నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. 1985లో అమెరికాలోడ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మి నిస్ట్రేషన్ ఏజెంట్‌  "కికి" కమరేనాను  కిడ్నాప్‌ చేసి. చిత్ర హింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కరుడుగట్టిన డ్రగ్ లార్డ్ రాఫెల్ కారో క్వింటెరోను నావికాదళం అరెస్ట్‌ చేసింది. 

కమరేనా హత్యకు క్వింటెరోకు 40 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, 28 ఏళ్ల శిక్ష తరువాత 2013లో, మెక్సికన్ న్యాయస్థానం అతనిని విడుదల చేయాలని ఆదేశించింది. ఇది అమెరికా అధికారులకు ఆగ్రహాన్ని తెప్పించింది. మెక్సికో సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని రద్దు చేసే సమయానికి, కారో క్వింటెరో  అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇరు దేశ దౌత్య సంబంధాలను దెబ్బ తీసింది. ఆ తరువాత సినాలోవా కార్టెల్‌కు తిరిగి వచ్చి డ్రగ్‌ దందా మొదలు పెట్టాడు క్వింటెరో. ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్‌ల జాబితాలో ఉన్న అతనిపై 20 మిలియన్ల యూఎస్ డాలర్ల బహుమతికూడా ఉంది. ఇది డ్రగ్ ట్రాఫికర్‌గా రికార్డు.

మరోవైపు క్వింటెరో అరెస్టును అమెరికా ప్రభుత్వం ప్రశంసించింది. అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్, కారో క్వింటెరోను తక్షణమే అప్పగించాలని కోరనున్నట్లు తెలిపారు."ఇది చాలా పెద్దవిషయం" అని వైట్ హౌస్ సీనియర్ లాటిన్ అమెరికా సలహాదారు జువాన్ గొంజాలెజ్ ట్వీట్‌ చేశారు. క్వింటెరో కారో అరెస్ట్‌తో మాదకద్రవ్యాల  అక్రమ రవాణాను అడ్డుకోవడంలో అమెరికా, మెక్సికో మధ్య సంబంధాలు మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు