దెబ్బకు 17 కార్లు డిస్‌కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?

12 Mar, 2023 21:04 IST|Sakshi

గతంలో బిఎస్6 ఉద్గార ప్రమాణాలు అమలులోకి వచ్చిన సందర్భంగా అనేక కార్ల ఉత్పత్తి నిలిపివేశారు. అయితే ఈ ఏడాది కూడా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) ఉద్గార ప్రమాణాల కారణంగా 2023 ఏప్రిల్ 01 నుంచి ఏకంగా 17 కార్లు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

రియల్ డ్రైవింగ్ ఎమిషన్ అనేది బిఎస్6 ఉద్గార ప్రమాణాల 2వ దశగా చెబుతున్నారు. ఇది వెహికల్ ఎగ్జాస్ట్‌ను నిశితంగా పరిశీలించి ఉద్గార నిబంధనలకు అనుగుణంగా క్యాటలిటిక్ కన్వర్టర్, ఆక్సిజన్ సెన్సార్ వంటి కీలక భాగాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది. అంతే కాకుండా వాహనాల నుండి విడుదలయ్యే NOx వంటి కాలుష్య కారకాలను కొలుస్తుంది.

వాహనంలో ఉపయోగించే సెమీకండక్టర్ కూడా క్రాంక్ షాఫ్ట్ పొజిషన్, థొరెటల్, ఎయిర్ ఇన్‌టేక్ ప్రెజర్, ఎగ్జాస్ట్, ఇంజిన్ ఉష్ణోగ్రత మొదలైన వాటి నుండి వచ్చే ఉద్గారాలను పర్యవేక్షించడానికి అప్‌గ్రేడ్ చేయాలి. కావున కంపెనీలు ఇంజిన్‌లను అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇది సంస్థ ఉత్పత్తుల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

కొత్త ఉద్గార నిబంధనలను ప్రవేశపెట్టడంతో, వాహనాల ఇంజిన్‌లో అనేక కొత్త మార్పులు చేయవలసి ఉంది, దీని కారణంగా వాహనాల ధరలు రూ.50,000 నుంచి రూ. 90,000 వరకు & ద్విచక్ర వాహనాల ధరలు రూ. 3,000 నుంచి రూ. 10,000 మధ్య పెరిగే సూచనలు ఉన్నాయి.

(ఇదీ చదవండి: రూ. 1,299కే కొత్త ఇయర్‌ఫోన్స్.. ఒక్క ఛార్జ్‌తో 40 గంటలు)

ఏప్రిల్ 01 నుంచి కనుమరుగయ్యే కార్ల జాబితాలో మహీంద్రా మొరాజో, ఆల్టురాస్ జి4, టాటా ఆల్ట్రోజ్ డీజిల్, మహీంద్రా KUV100, స్కోడా సూపర్బ్, ఆక్టేవియా, హ్యుందాయ్ ఐ20 డీజిల్, వెర్నా డీజిల్, రెనో క్విడ్800, నిస్సాన్ కిక్స్, మారుతి ఆల్టో800, ఇన్నోవా క్రిస్టా పెట్రోల్, హోండా జాజ్, అమేజ్ డీజిల్, డబ్ల్యుఆర్-వి, హోండా సిటీ 4వ తరం & 5వ తరం డీజిల్ మోడల్స్ ఉన్నాయి.

మరిన్ని వార్తలు