17 నెలల గరిష్టం...ధరల షాక్...!

13 Apr, 2022 07:02 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఎకానమీ ఇంకా సవాళ్ల దశ నుంచి తేరుకోలేదని తాజా ఆర్థిక గణాంకాలు వెల్లడించాయి. ముఖ్యంగా వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మార్చిలో  17 నెలల గరిష్ట స్థాయిలో 6.95 శాతంగా (2021 ఇదే నెల ధరలతో పోల్చి) నమోదయ్యింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే ఈ స్థాయి దాటి ఈ గణాంకాలు నమోదుకావడం ఇది వరుసగా మూడవనెల. ఇక ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిలో ఉన్నా... గణాంకాలు నామమాత్రంగానే నమోదుకావడం గమనార్హం. ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన


గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...

  • సామాన్యునిపై ధరల భారం తీవ్రత

సామాన్యునిపై ధరల భారం కొనసాగుతోందని తాజా గణాంకాలు సూచించాయి. జనవరి (6.01), ఫిబ్రవరితో (6.07) పాటు మార్చి నెల్లోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం 6 శాతం లక్ష్యం దాటి భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. రిటైల్‌ ద్రవ్యోల్బణం 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అటు తర్వాత ఈ స్థాయిలో (6.95 శాతం) రిటైల్‌ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. కాగా, జనవరి నుంచి మార్చి వరకూ త్రైమాసికం పరంగా చూసినా రిటైల్‌ ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించి 6.34 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ)  కొన్ని కీలక విభాగాలు పరిశీలిస్తే..

  •      2022 మార్చిలో ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం 7.68 శాతంగా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ బాస్కెట్‌ ధరల పెరుగుదల స్పీడ్‌ 5.85 శాతం. ఆయిల్‌ అండ్‌ ఫ్యాట్స్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 18.79 శాతం పెరిగింది. రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధ ప్రభావాలు దీనికి ప్రధాన కారణం. యుద్ధం వల్ల క్రూడ్‌ ఆయిల్‌ ధరలతో పాటు వంట నూనెల ధరలు కూడా తీవ్రంగా పెరిగాయి. దేశానికి సన్‌ ఫ్లవర్‌ ఎగుమతుల్లో ఉక్రెయిన్‌ మొదటి స్థానంలో ఉంది.  కూరగాయల ధరలు 11.64% పెరిగాయి. మాంసం, చేపలు ధరల స్పీడ్‌ 9.63 శాతంగా ఉంది
  • ఫ్యూయెల్‌ అండ్‌ లైట్‌ క్యాటగిరీలో ద్రవ్యోల్బణం 7.52 శాతం.  

     ద్రవ్యోల్బణం కట్టడిలో ఉంచుతూ వృద్ధే లక్ష్యంగా రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) యథాతథంగా కొనసాగించాలని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కట్టడి అంచనాలు, ఎకానమీ వృద్ధి లక్ష్యంగా ఆర్‌బీఐ వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది.  పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాలనూ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర ఆర్‌బీఐ పెంచింది. దీనితో 2022–23లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ కమిటీ అంచనావేసింది.

అమెరికాలోనూ ధరదడ
వాషింగ్టన్‌: ద్రవ్యోల్బణం సమస్య ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ ఉద్దీపనకు ఈజీ మనీ వ్యవస్థలోకి రావడం దీనికి ప్రధాన కారణం. అమెరికాకు సంబంధించి మంగళవారం ఆ దేశ కార్మిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం ఏకంగా 40 సంవత్సరాల గరిష్ట స్థాయి 8.5 శాతంగా నమోదయ్యింది. 1981 తర్వాత  ఈ స్థాయిలో దేశంలో ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. ఫుడ్, పెట్రోల్, హౌసింగ్, ఇతర నిత్యావసరాల ధరలు అమెరికా వినియోగదారులకు భారంగా మారాయి. అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్‌ రేటు ఇటీవలే పావుశాతం (0.25 శాతం నుంచి 0.50 శాతానికి) పెరిగిన సంగతి తెలిసిందే.   

పారిశ్రామిక ఉత్పత్తి విషయానికి వస్తే, 2022 ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 1.7 శాతం పురోగమించింది. ఈ స్థాయి వృద్ధి రేటుకూ కేవలం లో బేస్‌ ఎఫెక్ట్‌ ప్రధాన కారణం కావడం గమనార్హం.   ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2021 ఫిబ్రవరి గణాంకాలను పరిశీలిస్తే.. పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 3.2 శాతం క్షీణత నమోదయ్యింది.  

  • రంగాల వారీగా ఇలా...

మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం ఫిబ్రవరిలో కేవలం 0.8 శాతం వృద్ధిని నమోదుచేసుకోవడం గమనార్హం. మైనింగ్‌  రంగం 4.5 శాతం, విద్యుత్‌ ఉత్పత్తి 4.5 శాతం పురోగమించాయి. భారీ యంత్ర సామగ్రి, డిమాండ్‌కు సంకేతమైన క్యాపిటల్‌ గూడ్స్‌లో ఉత్పత్తి కేవలం 1.1 శాతంగా ఉంది. మౌలిక, నిర్మాణ రంగం ఉత్పత్తి 9.4 శాతం పెరిగింది. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండీషనర్లు వంటి కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ విభాగం 8.2 శాతం క్షీణించింది. ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌కు సంబంధించి కన్జూమర్‌ నాన్‌ డ్యూరబుల్స్‌ విభాగంలో కూడా ఉత్పత్తి 5.5 శాతం పడిపోయింది.  

  • ఏప్రిల్‌ నుంచి ఫిబ్రవరి వరకూ 12.5% వృద్ధి

కాగా గడచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి 11 నెలల కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 12.5 శాతంగా నమోదయ్యింది. తయారీ రంగం 12.9 శాతం పురోగమించింది.

>
మరిన్ని వార్తలు