జనవరిలో మనకు 2 వ్యాక్సిన్లు రెడీ!

5 Dec, 2020 13:12 IST|Sakshi

ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతులు?

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తయారీ కోవిషీల్డ్‌

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అంచనా

న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్‌-19 కట్టడికి వచ్చే(2021) జనవరికల్లా దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు ఎయిమ్స్‌(AIIMS) డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా తాజాగా పేర్కొన్నారు. ఈ రెండింటినీ దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీలే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం! వీటిలో ఒకటి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కాగా.. మరొకటి భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌. వీటిని ఎమర్జెన్సీ ప్రాతిపదికన ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) జనవరికల్లా అనుమతించవచ్చని రణదీప్‌ అంచనా వేశారు. మూడో దశ క్లినికల్‌ పరీక్షలలో ఉన్న వ్యాక్సిన్లకు ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశారు. కోవిడ్‌-19 నిర్వహణకు సంబంధించిన జాతీయ టాస్క్‌ ఫోర్స్‌లో సభ్యులు కూడా కావడంతో రణదీప్‌ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉన్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి.

యూకే బాటలో
ఇటీవల యూకే ప్రభుత్వం అత్యవసర వినియోగానికి యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికాసహా పలు యూరోపియన్‌ దేశాలలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న విషయం విదితమే. దీంతో పలు దేశాలు ఈ బాటను అనుసరించే వీలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. దేశీయంగా మూడో దశ క్లినికల్‌ పరీక్షలను పూర్తిచేసుకున్నాక వ్యాక్సిన్‌ పనితీరుపై డేటా ఆధారంగా ఔషధ నియంత్రణ సంస్థ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించే వీలున్నట్లు ఫార్మా నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని సీఎస్‌ఐఆర్‌- ఐఐఐఎంకు చెందిన రామ్‌ విశ్వకర్మ సైతం ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశీయంగానూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి సంప్రదించవచ్చని, అయితే డేటా ఆధారంగా డీసీజీఐ నిర్ణయాన్ని తీసుకోనుందని తెలియజేశారు. వ్యాక్సిన్‌కు అనుమతించడం లేదా మరిన్ని పరీక్షలకు ఆదేశించడం తదితర చర్యలకు వీలున్నట్లు వివరించారు.

పరిశీలించాకే
వ్యాక్సిన్‌ తుది దశ క్లినికల్‌ పరీక్షల డేటాను పరిశీలించాక పరిస్థితులకు అనుగుణంగా డీసీజీఐ పరిమితకాలానికి ఎమర్జెన్సీ అనుమతిని మంజూరు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆపై ఆయా కంపెనీలు వ్యాక్సిన్లపై పరీక్షల పూర్తి డేటాను అందజేయవలసి ఉంటుందని తెలియజేశారు. వ్యాక్సిన్‌ పనితీరు, భద్రత, ప్రమాణాలు, ఇతర ప్రభావాలు వంటి అంశాలను తెలియజేయవలసి ఉంటుందని వివరించారు. సైంటిస్టులు సిఫారసు చేశాక కొద్ది వారాలలోనే దేశీయంగా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో వారాంతాన ప్రధాని మోడీ సైతం ప్రకటించిన విషయం ప్రస్తావనార్హం! 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు