ఆటో పీఎల్‌ఐ స్కీమ్‌కి 20 కంపెనీల ఎంపిక

12 Feb, 2022 14:52 IST|Sakshi

రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలు

 వాహనాల తయారీ, విడిభాగాలకు చోటు 

అత్యాధునిక టెక్నాలజీలకూ చేయూత  

న్యూఢిల్లీ: ఆటోమొబైల్, ఆటోమొబైల్‌ విడిభాగాల పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద 20 కంపెనీల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హ్యుందాయ్, కియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర కంపెనీలు ఈ అవకాశాన్ని సొంతం చేసుకున్నాయి. ఆమోదించిన దరఖాస్తుదారుల నుంచి రూ.45,016 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్టు భారీ పరిశ్రమల శాఖ తెలిపింది.

చాంపియన్‌ ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చురర్స్‌ (ఓఈఎం) ఇన్సెంటివ్స్‌ స్కీమ్‌ కింద అశోక్‌లేలాండ్, ఐచర్‌ మోటార్స్, ఫోర్డ్‌ ఇండియా, హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా, కియా ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, పీసీఏ ఆటోమొబైల్స్, పినాకిల్‌ మొబిలిటీ సొల్యూషన్స్, సుజుకీ మోటార్‌ గుజరాత్, టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ఉన్నాయి. ఈ కేటగిరీలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను కలపలేదు. ద్విచక్ర, త్రిచక్ర  వాహనతయారీదారులకు ప్రోత్సాహకాల కింద బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్, పియాజియో వెహికల్స్, టీవీఎస్‌ మోటార్‌ ఎంపికయ్యాయి.

నాన్‌ ఆటోమోటివ్‌ ఇన్వెస్టర్‌ కేటగిరీ కింద యాక్సిస్‌ క్లీన్‌ మొబిలిటీ, భూమ ఇన్నోవేటివ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సొల్యూషన్స్, ఎలెస్ట్, హోప్‌ ఎలక్ట్రిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్, ఓలా ఎలక్ట్రిక్‌ టక్నాలజీస్, పవర్‌హాల్‌ వెహికల్‌ కంపెనీలు రాయితీలకు అర్హత పొందాయి. 18 శాతం వరకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దేశీయంగా విడిభాగాల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీల ఆవిష్కారానికి ఈ పథకం మద్దతుగా నిలవనుంది.మొత్తం రూ.25,938 కోట్లను ప్రోత్సాహకాలుగా ఇవ్వాలని గతంలోనే సర్కారు నిర్ణయించింది.   
 

మరిన్ని వార్తలు