1.7 కోట్ల వార్షిక యూనిట్లకు ఈవీ మార్కెట్‌  

25 Aug, 2022 08:33 IST|Sakshi

2030 నాటికి చేరుకుంటుంది

అందులో 1.5 కోట్లు ద్విచక్ర ఈవీలే

 ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌

ముంబై: దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ 2021-2030 మధ్య ఏటా 49 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్‌ అలయన్స్‌ (ఐఈఎస్‌ఏ) అంచనా వేసింది. వార్షిక అమ్మకాలు 2030 నాటికి 1.7 కోట్లకు చేరుకుంటాయని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అందులో ద్విచక్ర ఈవీలు 1.5 కోట్లుగా ఉంటాయని తెలిపింది. పెరిగిపోతున్న ఇంధన ధరలు, కొత్త కొత్త సంస్థలు ప్రవేశిస్తుండడం, ఈవీ టెక్నాలజీలో అభివృద్ధి, కేంద్ర, రాష్ట్రాల నుంచి సబ్సిడీ మద్దతు, ఉద్గారాల విడుదల ప్రమాణాలు ఇవన్నీ ఈవీ విక్రయాలు పెరిగేందుకు మద్దతుగా నిలుస్తున్న అంశాలని పేర్కొంది.

2020లో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ల నుంచి ఈవీ పరిశ్రమ చాలా వేగంగా కోలుకున్నట్టు గుర్తు చేసింది. 2021లో మొత్తం ఈవీ విక్రయాలు 4.67 లక్షల యూనిట్లలో సగం ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు ఉండగా, ఆ తర్వాత తక్కువ వేగంతో నడిచే త్రిచక్ర వాహనాలున్నట్టు తెలిపింది. ఇతర విభాగాల్లోనూ విక్రయాలు పుంజుకున్నట్టు పేర్కొంది. 2021–2030 మధ్య ఈవీ బ్యాటరీ డిమాండ్‌ ఏటా 41 శాతం మేర పెరుగుతూ, 142 గిగావాట్‌ హవర్‌కు (జీడబ్ల్యూహెచ్‌) చేరుకుంటుందని వెల్లడించింది. 2021లో 6.5 జీడబ్ల్యూహెచ్‌గా ఉన్నట్టు తెలిపింది. బ్యాటరీల ధరలు తగ్గుతుండడం, ఈవీ సాంకేతికతల్లో అత్యాధునికత వల్ల ఈవీల ధరలు కంబస్టన్‌ ఇంజన్‌ వాహనాల ధరల స్థాయికి (2024-25 నాటికి) చేరుకుంటాయని అంచనా వేసింది. భారత ఈవీ మార్కెట్‌లో లెడ్‌ యాసిడ్‌ ఆధారిత బ్యాటరీల ఆధిపత్యం కొనసాగుతోందని, 2021లో 81 శాతం మార్కెట్‌ వీటిదేనని పేర్కొంది. లిథియం అయాన్‌ బ్యాటరీలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతుందంటూ, 2021లో మొదటిసారి 1గిగావాట్‌కు చేరుకున్నట్టు వివరించింది.  

మరిన్ని వార్తలు