‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగమా..వద్దు బాబోయ్’, కంపెనీలకు షాకిస్తున్న ఐటీ ఉద్యోగులు!

3 Oct, 2022 11:52 IST|Sakshi

ఐటీ - బీపీఎం ఇండస్ట్రీలో అట్రిషన్‌ రేటు రోజురోజుకి భారీ స్థాయిలో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. 2025 నాటికి 22 లక్షల మంది ప్రొఫెషనల్స్‌ ఐటీ రంగానికి స్వస్తి చెప్పనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. 

ఐటీ ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో కంపెనీకి మారడం సాధారణమే. అయితే కోవిడ్‌ పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు డిమాండ్‌ పెరగడంతో ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి అడుగు పెట్టే వారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వారిని నిలుపుకునేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నా, వేరే సంస్థలు ఇస్తున్న ఆఫర్లు నచ్చడంతో ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. దీంతో కంపెనీలకు జీతభత్యాల పెరిగిపోవటం, ఇప్పటికే ఖాళీగా ఉన్న స్థానాల్ని భర్తి చేసేందుకు భారీ ఎత్తున శాలరీలు అందించడం తలనొప్పిగా మారింది. అయినా అట్రిషన్‌ రేటు ఐటీ సంస్థల్ని తీవ్రంగా వేధిస్తోంది. 

ఈ తరుణంలో టీమ్‌ లీజ్‌ డిజిటల్‌ సంస్థ రానున్న సంవత్సరాల్లో ఐటీ ప్రొఫెషనల్స్‌ టెక్నాలజీ రంగాన్ని వదిలేస్తున్నారంటూ ఓ షాకింగ్‌ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం..57 శాతం మంది నిపుణులు భవిష్యత్‌లో తిరిగి ఐటీ రంగంలో తిరిగి వచ్చే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ ఐటీ సంస్థల్ని వదిలేసే ఇతర రంగాల వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ నివేదికలో తెలిపింది. 

ఐటీ ఉద్యోగానికి సెలవు 
దాదాపు 50 శాతం మంది ఉద్యోగులకు తమ పనికి తగిన ప్రతి ఫలం లేదనే అసంతృప్తిలో ఉన్నారని, 25 శాతం మంది  కెరీర్ వృద్ధి లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు

అట్రిషన్‌ రేటు 55 శాతం 
ఫైనాన్షియల్‌ ఇయర్‌ 2022లో ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అట్రిషన్‌ రేటు 49శాతం ఉండగా, ఆర్ధిక సంవత్సరం 2023 నాటికి 55 శాతం పెరుగుతుందని టీమ్‌ లీజ్‌ విడుదల చేసిన  ‘టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్’లో హైలెట్‌ చేసింది. అంతేకాదు జీతం పెంపు పనితీరును మెరుగుపరుస్తుందని, ఉద్యోగ సంతృప్తిని పెంచుతుందని, 2025 నాటికి 20 లక్షల-22 లక్షల మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేస్తారని వెల్లడించింది. 

చదవండి👉 ఉద్యోగులకు బంపరాఫర్‌.. రండి బాబు రండి మీకు భారీ ప్యాకేజీలిస్తాం!

మరిన్ని వార్తలు