ఏటా మూడు వినూత్న ఉత్పత్తులు: డాక్టర్‌ రెడ్డీస్‌

25 Nov, 2022 10:38 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చికిత్స ప్రమాణాలను మెరుగుపర్చగలిగే మూడు వినూత్న ఉత్పత్తులను ఏటా ఆవిష్కరించాలని ఔషధ రంగ దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) నిర్దేశించుకుంది. అలాగే 2030 నాటికి 150 కోట్ల మంది పేషంట్లకు తక్కువ ధరల్లో ఔషధాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి నిర్దేశించుకున్న సుస్థిర వృద్ధి లక్ష్యాల ప్రణాళికను కంపెనీ గురువారం ఆవిష్కరించింది. దీని ప్రకారం కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా, 2030 నాటికి పూర్తిగా 100 శాతం పునరుత్పాదక విద్యుత్‌నే వాడుకునేలా ప్రణాళికలు ఉన్నాయి.

అలాగే 2027 నాటికి మార్కెట్లో తామే ముందుగా ప్రవేశపెట్టే ఉత్పత్తులు 25 శాతం ఉండేలా కంపెనీ కృషి చేయనుంది. అటు సీనియర్‌ లీడర్‌షిప్‌ స్థాయిలో మహిళల సంఖ్యను ప్రస్తుత స్థాయికి మూడు రెట్లు పెంచుకుని 35 శాతానికి పెంచుకోనుంది. సామాజిక, పర్యావరణ లక్ష్యాలపరంగా చూస్తే వ్యర్థాలను గణనీయంగా తగ్గించుకోవడం తదితర అంశాలు ఉన్నాయి.  (ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు తీపికబురు!)

మరిన్ని వార్తలు