26 వేల నుంచి 50 వేలకు పరుగు

21 Jan, 2021 16:01 IST|Sakshi

సాక్షి, ముంబై:  21.01.2021 ప్రత్యేకమైన ఈ డేట్‌కు స్టాక్ మార్కెట్ చరిత్రలో అంతే ప్రాముఖ్యత ఉంది.ఎందుకంటే  దేశీయ ఈక్విటీ మార్కెట్‌  అతిపెద్ద మైలురాయిని చేరుకున్న రోజు. దాదాపు 42ఏళ్ల స్టాక్ మార్కెట్  ప్రస్తానంలో  50వేల మార్క్‌ను అధిగమించిన కీలకఘట్టం  నమోదైంది. గత కొన్నిరోజులుగా అల్‌టైం రికార్డుస్థాయికి చేరుకున్న రికార్డులు క్రియేట్‌ చేస్తున్న  కీలక సూచీలు ఇంకా అదే జోష్‌ను కొనసాగిస్తున్నాయి. కేవలం పది నెలల కాలంలో రెట్టింపు వృద్ధిని నమోదు చేయడం విశేషం.

దలాల్ స్ట్రీట్‌లో బుల్‌రన్‌ను ఒకసారి పరిశీలిస్తే..
గత ఏడాది మార్చి 23న, సెన్సెక్స్ చరిత్రలో ఒకే రోజు అత్యంత ఘోరమైన పతనాన్ని నమోద చేసింది.  కరోనా మహమ్మారి కట్టడికిగాను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన మరోసటి రోజు  2020 మార్చి 24 న మార్కెట్‌ 13 శాతానికి పైగా నష్టపోయింది. దీంతో సెన్సెక్స్‌  26వేల దిగువకు చేరింది.  కానీ  ఆ తరువాత నుంచి వెనుదిరిగి చూసింది లేదు. మెటల్‌, ఆటో, ఐటీ, బ్యాంకింగ్‌, రియల్టీ , ఫార్మా రంగాలు ఇలా ఒక్కోరోజు ఒక్కో రంగంలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో పదినెలలకాలంలోనే శరవేగంగా పుంజుకుంది. ఫలితంగా 3 సంవత్సరాల కనిష్టం 25,639 నుండి ఇండెక్స్ దాదాపు 100 శాతం పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులకు తోడు, యంగ్‌ ఇండియా స్టాక్ మార్కెట్‌పై ఆసక్తి పెంచుకోవడంతో సెన్సెక్స్ చరిత్రలో మొదటిసారిగా 50వేల స్థాయి వద్ద కొత్త శిఖరాన్ని తాకింది. అంతేకాదు ప్రపంచంలో టాప్ స్టాక్ మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందింది.

మూడు నెలల్లో 40 వేల  50వేల స్తాయికి ఎగబాకింది అతి తక్కువ కాలంలోనే, ప్రముఖ ప్రపంచ సూచికలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా సూచికలు తిరోగమనంలో ఉంటే, సెన్సెక్స్ 87 శాతం పెరిగింది.  92 శాతం పెరిగిన నాస్‌డాక్‌ టెక్నాలజీ హెవీ ఇండెక్స్ మినహా ఇది ప్రపంచంలోని అన్ని ప్రముఖ బెంచ్ మార్క్ సూచికలను ఓడించింది. ప్రపంచంలోని అగ్ర ఆరు ఆర్థిక వ్యవస్థలలో, యుఎస్ (ఎస్ అండ్‌ పి 500)  69 శాతం , యూకే 34 శాతం, చైనా  57 శాతం,  జపాన్ 34 శాతం, జర్మనీ బెంచ్‌మార్క్‌ సూచీలు 65 శాతం పెరగడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు