28 ఐపీవోలు .. రూ. 45,000 కోట్లు

16 Aug, 2022 05:55 IST|Sakshi

ఏప్రిల్‌–జూలై మధ్యలో అనుమతినిచ్చిన సెబీ

ఇప్పటికే రూ. 33,000 కోట్లు సమీకరించిన 11 సంస్థలు

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూలై మధ్య కాలంలో 28 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ (ఐపీవో)ల ద్వారా రూ. 45,000 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతినిచ్చింది. వీటిలో 11 సంస్థలు ఇప్పటికే రూ. 33,254 కోట్లు సమీకరించాయి. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌దే (రూ. 20,557 కోట్లు) ఉంది. ఏప్రిల్‌–మే నెలల్లోనే చాలా సంస్థలు ఐపీవోకి వచ్చాయి. మే తర్వాత పబ్లిక్‌ ఇష్యూలు పూర్తిగా నిల్చిపోయాయి.

  ప్రస్తుతం మార్కెట్లో పరిస్థితులు అంత అనుకూలంగా లేకపోవడంతో తగిన సమయం కోసం పలు సంస్థలు వేచి చూస్తున్నాయని మర్చంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలు తెలిపాయి. వీటిలో చాలా మటుకు కంపెనీలు రోడ్‌షోలు కూడా పూర్తి చేశాయని ఆనంద్‌ రాఠీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ రావు చెప్పారు. ఐపీవోలకు అనుమతులు పొందిన సంస్థలలో ఫ్యాబ్‌ఇండియా, భారత్‌ ఎఫ్‌ఐహెచ్, టీవీఎస్‌ సప్లయ్‌ చైన్‌ సొల్యూషన్స్, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, మెక్‌లియోడ్స్‌ ఫార్మాస్యూటికల్స్, కిడ్స్‌ క్లినిక్‌ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి.

సెంటిమెంట్‌ డౌన్‌: గత ఆర్థిక సంవత్సరంలో (2021–22) 52 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా రికార్డు స్థాయిలో రూ. 1.11 లక్షల కోట్లు సమీకరించాయి. కొత్త తరం టెక్నాలజీ స్టార్టప్‌ల ఇష్యూలపై ఆసక్తి నెలకొనడం, రిటైల్‌ ఇన్వెస్టర్లు భారీగా పాలుపంచుకోవడం, లిస్టింగ్‌ లాభాలు తదితర అంశాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ప్రస్తుతం సెకండరీ మార్కెట్‌ భారీగా కరెక్షన్‌కు లోను కావడం, పేటీఎం.. జొమాటో వంటి డిజిటల్‌ కంపెనీల పనితీరు ఘోరంగా ఉండటం, ఎల్‌ఐసీ వంటి దిగ్గజం లిస్టింగ్‌లో నిరాశపర్చడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజిస్ట్‌ వీకే విజయకుమార్‌ వివరించారు.  

క్యూలో మరిన్ని కంపెనీలు.
పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ .. ఐపీవో ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసేందుకు గత రెండు నెలలుగా కంపెనీలు క్యూ కడుతుండటం గమనార్హం. జూన్‌–జూలైలో మొత్తం 15 కంపెనీలు సెబీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. సూలా విన్‌యార్డ్స్, అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్, ఉత్కర్‌‡్ష స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్, సాయి సిల్క్‌ కళామందిర్‌ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చిన్న నగరాల్లో అద్భుతంగా రా>ణించిన వ్యాపార సంస్థల ప్రమోటర్లు ఇప్పుడు కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ముందుకు వస్తున్నారని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఎండీ అభిజిత్‌ తారే తెలిపారు. త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా నమోదవుతుండటం, ఆర్థిక డేటా కాస్త ప్రోత్సాహకరంగా కనిపిస్తుండటం తదితర అంశాలు, ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో సహేతుకమైన ధరతో వచ్చే కంపెనీల ఐపీవోలకు సానుకూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు