రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్‌

16 Oct, 2020 05:44 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత అంశాల నేపథ్యంలో డిమాండ్, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి కేంద్రం ప్రకటించిన రెండవదఫా ఉద్దీపన ఈ దిశలో స్వల్ప ప్రయోజనాలనే అందిస్తుందని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ గురువారం పేర్కొంది. అక్టోబర్‌ 12న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగులకు లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎట్‌టీసీ) క్యాష్‌ వోచర్‌ స్కీమ్, ప్రత్యేక పండుగల అడ్వాన్స్, రాష్ట్రాలకు వడ్డీరహిత రూ.12,000కోట్ల రుణం, రూ.25,000 కోట్ల అదనపు మూలధన ప్రయోజనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రూ.46,700 కోట్ల విలువైన ఈ ఉద్దీపన 2020–21  స్థూల దేశీయోత్పత్తి  (జీడీపీ)లో 0.2 శాతం ఉంటుందని అంచనా.  రెండు విడతల ఉద్దీపనలనూ కలుపుకుని ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యక్ష వ్యయాలను పరిశీలిస్తే, ఈ మొత్తం జీడీపీలో 1.2 శాతం ఉంటుందని మూడీస్‌ అంచనావేసింది. బీఏఏ రేటింగ్‌ ఉన్న ఇతర దేశాల్లో కరోనా సంబంధ ఉద్దీపన జీడీపీలో సగటును 2.5 శాతం ఉందని మూడీస్‌ తెలిపింది.  

వ్యయాలకు కఠిన పరిమితులు...
వ్యయాల విషయంలో భారత్‌ కఠిన పరిమితులను ఎదుర్కొంటోందని మూడీస్‌ పేర్కొంది.  జీడీపీలో ప్రభుత్వ రుణ భారం గత ఏడాది 72% ఉంటే, 2020లో దాదాపు 90 శాతానికి పెరగనుందని విశ్లేషించింది. అలాగే ఆదాయాలు తగ్గడం వల్ల ద్రవ్యలోటు జీడీపీలో 12 శాతానికి పెరిగిపోయే పరిస్థితి కనబడుతోందనీ అంచనా వేసింది.
 

>
మరిన్ని వార్తలు