రూ. 3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరం

18 Jun, 2021 00:58 IST|Sakshi

ఎకానమీ పురోగతికి సీఐఐ సిఫార్సు ప్రత్యక్ష నగదు

బదలాయింపునకూ సూచన

2021–22లో 9.5% వృద్ధి అంచనా

వ్యాక్సినేషన్‌ సత్వర పూర్తికి ప్రత్యేక యంత్రాంగం ప్రతిపాదన

న్యూఢిల్లీ: కరోనా కష్టాల్లో కూరుకుపోయిన ఎకానమీకి ఊతం ఇవ్వడానికి రూ.3 లక్షల కోట్ల ఉద్దీపన అవసరమని ఇండస్ట్రీ చాంబర్‌ సీఐఐ ప్రెసిడెంట్‌ టీవీ నరేంద్రన్‌ పేర్కొన్నారు. ఉద్దీపనలో భాగంగా జన్‌ ధన్‌ అకౌంట్ల ద్వారా కుటుంబాలకు ప్రత్యక్ష నగదు బదలాయింపు జరపాలనీ ఆయన సూచించారు. బ్రిటన్‌ తరహాలో వ్యాక్సినేషన్‌ సత్వర విస్తృతికి ‘వ్యాక్సిన్‌ జార్‌’ను (లేదా మంత్రి) నియమించాలని  సిఫారసు చేశారు. దేశ ఆర్థిక పురోగతి విషయమై విలేకరులతో ఆయన మాట్లాడిన అంశాల్లో ముఖ్యమైనవి...

► భారత్‌ ఎకానమీ వినియోగ ఆధారితమైనది.ఈ డిమాండ్‌ను మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరిస్థితుల్లో నగదు ప్రత్యక్ష బదలాయింపు కీలకమని సీఐఐ భావిస్తోంది.
► ఎంఎన్‌ఆర్‌ఈజీఏ (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కింద కేటాయింపులు మరింత పెంచాలి.  
► వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గింపులు డిమా ండ్‌ పురోగతికి దోహదపడుతుంది. గృహ కొనుగోలుదారులకు స్టాంప్‌ డ్యూటీ, వడ్డీ రాయితీలు అవసరం. గతేడాది తరహాలో ఎట్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌ ఆత్మనిర్బర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజనను 2022 మార్చి 31 వరకూ పొడిగించాలి.  
► లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎం ఎస్‌ఎంఈ) సహా కంపెనీలకు సకాలంలో తగిన అన్ని చెల్లింపులూ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
► వృద్ధికి సంబంధించి వ్యయాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సత్వర పురోగతి ఉండాలి.  
► దేశంలోని వయోజనులు అందరికీ 2021 డిసెంబర్‌ కల్లా వ్యాక్సినేషన్‌ పుర్తికావాలి. ఇందుకు రోజుకు సగటున కనీసం 71.2 లక్షల డోసేజ్‌ వ్యాక్సినేషన్‌ జరగాలి. ఈ దిశలో ఏజెన్సీలు, రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల మధ్య సమన్వయ సహకారం అవసరం. వ్యాక్సినేషన్‌ ఆవశ్యకత ప్రచారానికి క్రీడా, సినీ ప్రముఖుల సేవలను వినియోగించుకోవాలి.  
► కోవిడ్‌–19 మూడవ వేవ్‌ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్‌ కేర్‌ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా పాలనా యంత్రాంగాలు, ప్రైవేటు రంగ భాగస్వాములు దృష్టి సారించాలి.
► బ్యాంకింగ్‌  మొండిబకాయిల సమస్య సత్వర పరిష్కారానికి కృషి చేయాలి.  
► భవిష్యత్‌లో ఎటువంటి మహమ్మారినైనా తట్టుకుని నిలబడ్డానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి.

>
మరిన్ని వార్తలు