అమెరికాను మించిపోయిన్‌ భారత్‌.. ఆన్‌లైన్‌ @ 34.6 కోట్లు!

3 Aug, 2022 04:50 IST|Sakshi

ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య ఇది...

యూఎస్‌ జనాభా కంటే అధికం

ఐఏఎంఏఐ–కాంటార్‌ నివేదిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఈ–కామర్స్, డిజిటల్‌ పేమెంట్స్‌ వంటి ఆన్‌లైన్‌ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య సుమారు 34.6 కోట్లకు చేరుకుంది. ఈ సంఖ్య 33.1 కోట్లుగా ఉన్న యూఎస్‌ జనాభా కంటే అధికం కావడం విశేషం. ‘భారత్‌లో ఇంటర్నెట్‌’ పేరుతో ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, మార్కెటింగ్‌ డేటా, అనలిటిక్స్‌ సంస్థ కాంటార్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదిక ప్రకారం.. 2019లో దేశంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిపిన వారి సంఖ్య 23 కోట్లు. కరోనా మహమ్మారి కాలంలో ఈ సంఖ్య 51 శాతం పెరగడం గమనార్హం.

ఇంటర్నెట్‌ వినియోగం పరంగా సామాజిక మాధ్యమాలు, వినోదం, సమాచార కార్యకలాపాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సమాచార విభాగంలో టెక్ట్స్, ఈ–మెయిల్‌ అత్యంత ప్రజాదరణ పొందాయి. వాయిస్, దేశీయ భాషల వినియోగం భవిష్యత్తులో వృద్ధికి కీలకాంశాలుగా ఉంటాయి. గ్రామీణ భారతదేశంలో ఓటీటీ వేదికల వినియోగం పట్టణ భారత్‌తో సమానంగా ఉంది. ఆన్‌లైన్‌ గేమింగ్, ఈ–కామర్స్, డిజిటల్‌ చెల్లింపుల వ్యాప్తి ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లోనే అధికం. దేశవ్యాప్తంగా 69.2 కోట్ల మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల నుంచి 35.1 కోట్లు, పట్టణ ప్రాంతాల నుంచి 34.1 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి నెటిజన్ల సంఖ్య భారత్‌లో 90 కోట్లను తాకుతుంది.

యూపీఐ వినియోగం భేష్‌: ప్రధాని
న్యూఢిల్లీ: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) జూలైలో ఆరు బిలియన్ల లావాదేవీలను నమోదు చేయడం ‘అత్యద్భుతమైన అంశమని‘ అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి, ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా, పారదర్శకంగా మార్చడానికి ప్రజల సమిష్టి సంకల్పాన్ని ఇది సూచిస్తోందని ఆయన అన్నారు. ‘‘యూపీఐ జూలైలో 6 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది.   2016 నుండి ఎన్నడూ లేని విధంగా ఈ భారీ లావాదేవీలు జరిగాయి’’ అని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌–19 మహమ్మారి సమయంలో డిజిటల్‌ పేమెంట్‌ సర్వీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని కూడా మోదీ పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు