భారత్‌లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం, క్యూ కడుతున్న సరిహద్దు దేశాలు!

17 Mar, 2022 14:26 IST|Sakshi

భారత్‌కు సరిహద్దు దేశాల నుంచి 2020 ఏప్రిల్‌ 18 నుంచి దాదాపు 347 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలు వచ్చినట్లు వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ ప్రకాశ్‌ లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. 

వీటి విలువ రూ.75,951 కోట్లని తెలిపారు. వీటిలో 13,625 కోట్ల విలువైన 66 ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు. భారత్‌ ఆమోదించిన 66 ప్రతిపాదనల్లో ఆటోమొబైల్‌ (7), రసాయనాలు (5), కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ (3), ఫార్మా (4), విద్య (1), ఎలక్ట్రానిక్స్‌ (8), ఫుడ్‌ ప్రాసెసింగ్‌ (2), సమాచార, ప్రసారంతో సహా రంగాలకు చెందినవి (1), యంత్ర పరికరాలు (1), పెట్రోలియం, సహజ వాయువు (1), విద్యుత్‌ (1), సేవల రంగం (11) ఉన్నాయని మంత్రి వివరించారు. 193 ప్రతిపాదనల విషయంలో తిరస్కరించడమో, మూసివేయడమో లేక ఆయా దేశాలు ఉపసంహరించుకోవడమే జరిగిందన్నారు. 

కోవిడ్‌–19 నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల నుండి విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం ముందస్తు అనుమతిని కేంద్రం తప్పనిసరి చేసింది. భారత్‌ సరిహద్దు దేశాల్లో చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మియన్మార్, ఆఫ్ఘనిస్తాన్‌లు ఉన్నాయి.

చదవండి: భారత్‌పై ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌, కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు! ఇక బాదుడేనా?

మరిన్ని వార్తలు