భారీగా పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు, ఎంతంటే?

10 Sep, 2022 07:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎకానమీ పురోగతికి అద్దం పడుతూ, ప్రత్యక్ష పన్ను వసూళ్లలో భారీ వృద్ధి నమోదయ్యింది. ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు విడుదల చేసిన గణాంకాలను విడుదల చేసింది. 

వీటి ప్రకారం, ఏప్రిల్‌ నుంచి ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) సెప్టెంబర్‌ 8వ తేదీ వరకూ గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్ధూలంగా 35 శాతం పురోగతి నమోదయ్యింది. విలువలో రూ.6.48 లక్షల కోట్ల పరోక్ష పన్ను వసూళ్లు జరిగాయి. ఇక రిఫండ్స్‌ విషయానికి వస్తే, సమీక్షా కాలంలో ఈ పరిమాణం రూ.1.19 లక్షల కోట్లు. వెరసి నికర వసూళ్లు 30.17 శాతం వృ ద్ధితో రూ.5.29 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

గత ఏడాది ఇదే కాలంలో పోల్చితే రిఫండ్స్‌ 65.29 శాతం అధికం. సమీక్షా కాలంలో విభాగాల వారీగా చూస్తే,  కార్పొరేట్‌ ఆదాయపు పన్ను (సీఐటీ) వసూళ్లలో స్థూలంగా 25.95 శాతం వృద్ధి నమోదయితే, వ్యక్తిగత పన్ను స్థూల వసూళ్లలో (ఎస్‌టీటీ సహా) 44.37 శాతం వృద్ధి చోటుచేసుకుంది.  రిఫండ్స్‌ సర్దుబాటు చేస్తే ఈ వృద్ధి రేట్లు వరుసగా 32.73 శాతం, 28.32 శాతాలుగా ఉన్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.14.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ పరిమాణాన్ని రూ.14.20 లక్షల కోట్లుగా కేంద్ర బడ్జెట్‌ అంచనా వేస్తోంది.   

మరిన్ని వార్తలు