ప్రాజెక్టుల్లో జాప్యంతో రూ.4.52 లక్షల కోట్ల భారం

24 Oct, 2022 06:27 IST|Sakshi

నత్తనడకన 384 ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు

న్యూఢిల్లీ: మౌలిక రంగ ప్రాజెక్టుల్లో జాప్యం వాటి నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచేస్తోంది. రూ.150 కోట్లు, అంతకుమించి వ్యయంతో కూడిన మొత్తం 1,529 ప్రాజెక్టులకు గాను 384 ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల.. రూ.4.52 లక్షల కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ నివేదిక వెల్లడించింది. అలాగే, మొత్తం 662 ప్రాజెక్టులు ఆలస్యంగా సాగుతున్నట్టు పేర్కొంది. ‘‘1,529 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.21,25,851 కోట్లు. కానీ, నిర్మాణం పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.25,78,197 కోట్లకు చేరనుంది.

అంటే రూ.4,52,345 కోట్ల అదనపు వ్యయం కానుంది’’అని వివరించింది. 2022 సెప్టెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టులపై చేసిన వ్యయం రూ.13,78,142 కోట్లుగా ఉంది. 662 ప్రాజెక్టుల్లో 1–12 నెలల ఆలస్యంతో నడుస్తున్నవి 133 ఉన్నాయి. 124 ప్రాజెక్టులు 13–24 నెలలు, 276 ప్రాజెక్టులు 25–60 నెలలు, 129 ప్రాజెక్టులు వాస్తవ గడువుతో పోలిస్తే 61 నెలలకు మించి ఆలస్యంగా సాగుతున్నాయి. భూ సమీకరణ, అటవీ, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టులకు కావాల్సిన రుణాల సమీకరణలో ఆలస్యం కారణాలుగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.   
 

మరిన్ని వార్తలు