4 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లకు భారంగా రైల్వేశాఖ నిర్ణయం! ఏంటంటే..

23 Nov, 2021 11:47 IST|Sakshi

అవసాన దశలో ఇతరులపై ఆధారపడి జీవించే వారికి శాపంగా మారింది రైల్వేశాఖ నిర్ణయం. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సొమ్ముతోనో ప్రయాణం చేసే సీనియర్‌ సిటిజన్స్‌కి రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్‌ సిటిజన్లు.


రాయితీలకు కోత
సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్‌ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ తదితర వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 24 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు.

అధిక ఛార్జీలు
రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. దీంతో గత ఏడాది కాలంగా అన్ని రైళ్లలో ప్రయాణిస్తున్న సీనియర్‌ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్‌ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్‌ చెకప్‌ల కోసం క్రమం తప​‍్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు.


నాలుగు కోట్ల మంది
లాక్‌డౌన్‌ తర్వాత స్పెషల్‌ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ‍ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్‌ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్‌ గౌర్‌  అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్‌డ్‌ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఈ రోజు వరకయితే ఈ సంఖ్య నాలుగు కోట్లకు తక్కువగా ఉండదు. 

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడి కావడంతో ఒక్కసారిగా రైల్వేశాఖపై విమర్శలు పెరిగాయి. కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే రాయితీలకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమాజానికి సర్వం ధారపోసిన వృద్ధుల పట్ల నిర్థయగా వ్యవహరించడం సరికాదంటూ సుతిమొత్తగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం రైల్వేశాఖ తీరును తప్పు పట్టారు. రాయితీలు పునరుద్ధరించాలంటూ రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు.

చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..

మరిన్ని వార్తలు