జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు ఇవీ గుర్తుపెట్టుకోండి!

6 Dec, 2021 20:49 IST|Sakshi

ఆర్థిక ప్రణాళికల్లో జీవిత బీమాకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో జీవిత బీమా పాలసీలను పోల్చి చూసుకుని, తీసుకోవడం సులభతరంగానే ఉంటున్నప్పటికీ.. పాలసీని ఎంపిక చేసుకునే ముందు పరిశీలించాల్సిన నాలుగు ముఖ్యాంశాలు ఉంటాయి. అవేంటంటే: 

  • ఆర్థిక లక్ష్యాలను మదింపు చేసుకోవడం: ప్రతీ ఒక్కరి జీవితాలు, లక్ష్యాలు, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి ముందుగా మీ లక్ష్యాలను అర్థం చేసుకోవాలి. బీమా పాలసీ అనేది మీరు ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, అలాగే మీపై ఆధారపడిన వారి భవిష్యత్తుకు తోడ్పడే విధంగా ఉండాలి. మీ పిల్లల చదువులు, పెళ్లిళ్లు, రుణాలు, వైద్య చికిత్సల ఖర్చులు, లేదా రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి పలు రకాల అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. తక్కువ ప్రీమియంలతో అధిక కవరేజీ ఉండాలని భావించేవారికి టర్మ్‌ ప్లాన్‌ ఉత్తమమైనది. రిటైర్మెంట్‌ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు కావాలంటే యులిప్‌ (యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌) లేదా రిటైర్మెంట్‌ ప్లాన్‌లో కూడా ఇన్వెస్ట్‌ చేసే అవకాశాలను పరిశీలించవచ్చు. 
  • సొంతంగా అధ్యయనం చేయండి: మార్కెట్లో ప్రస్తుతం అనేకానేక పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకునేందుకు ముందు తగు స్థాయిలో అధ్యయనం చేయండి. పాలసీ రకం, అది అందించే ప్రయోజనాలను పరిశీలించండి. ఉదాహరణకు కొన్ని ప్లాన్లు రిటైర్మెంట్‌ నిధిని ఏర్పాటు చేసుకోవడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలకు ఉపయోగపడగలవు. అలాగే చిల్డ్రన్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలు మీ పిల్లల భవిష్యత్తుకు పలు రకాలుగా ఉపయోగకరంగా ఉండగలవు. ఇక ఎండోమెంట్‌ పాలసీ అనేది ఇటు జీవిత బీమా అటు పొదుపు ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే ఏకమొత్తంగా రాబడులు అందించగలదు.
  • కవరేజీ ఎంచుకోవడం: సరైన ప్లాన్‌ ఎంచుకోవడం ఎంత ముఖ్యమో .. తగినంత కవరేజీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. సమ్‌ అష్యూర్డ్‌ అనేది హ్యూమన్‌ లైఫ్‌ వేల్యూ (హెచ్‌ఎల్‌వీ) లేదా ఆర్థికంగా పాలసీదారు విలువ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆదాయం, వ్యయాలు, భవిష్యత్తులో వచ్చే బాధ్యతలు, చేయాల్సిన చెల్లింపులు, వివిధ దశల్లో ఆర్థిక లక్ష్యాలు మొదలైన అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కవరేజీ ఎంత తీసుకోవాలన్నదానిపై ఇథమిత్థంగా ఫార్ములా అంటూ ఏమీ లేకపోయినప్పటికీ.. వార్షిక వేతనానికి కనీసం 15 రెట్లు అయినా ఉండాలన్నది బండగుర్తుగా పాటిస్తుంటారు. 
  • పాలసీని ల్యాప్స్‌ కానివ్వకండి: టర్మ్‌ పూర్తయ్యే వరకూ వార్షిక ప్రీమియంలను చెల్లించడం ఆపకుండా జాగ్రత్తపడండి. బీమా ప్రయోజనాల రూపంలో మీపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇది తోడ్పడుతుంది. 

ఈ చిన్న అంశాలు దృష్టిలో ఉంచుకుంటే చాలు.. బీమా పాలసీ ప్రక్రియ అంతా సజావుగా ఉండగలదు. మీకు, మీ మీద ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించగలదు. 

- సంజయ్ తివారీ, డైరెక్టర్‌ (స్ట్రాటజీ) ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్

మరిన్ని వార్తలు