Industrial parks: 'లీడర్‌'లుగా 41 ఇండస్ట్రీయల్‌ పార్క్‌లు

6 Oct, 2021 08:31 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 41 పారిశ్రామిక పార్క్‌లు ’లీడర్‌’ గుర్తింపు దక్కించుకున్నాయి. వీటిలో 98 శాతం పార్క్‌లు పశ్చిమ (మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్‌) ఉత్తరాది (ఉత్తరాఖండ్‌) ప్రాంతాల్లో ఉన్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రెండో విడత పారిశ్రామిక పార్క్‌ల రేటింగ్స్‌ సిస్టమ్‌ (ఐపీఆర్‌ఎస్‌) నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మధ్యప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల నుంచి 90 పార్క్‌లు చాలెంజర్‌లుగాను, 185 ఆశావహ పార్క్‌లుగాను రేటింగ్‌లు దక్కించుకున్నాయి.  

ప్రస్తుత ప్రమాణాలు, మౌలిక సదుపాయాల ప్రాతిపదికన ఈ రేటింగ్స్‌ ఇచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్‌ ప్రకాశ్‌ తెలిపారు. ఈ రేటింగ్‌ ప్రక్రియ దేశాభివృద్ధికి దోహదపడగలదని, ఇటు పరిశ్రమకు అటు దేశ పురోగతికి తోడ్పడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంచుకునేందుకు ఉపయోగపడే ఇండియా ఇండస్ట్రియల్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ (ఐఐఎల్‌బీ – ఇది జీఐఎస్‌ ఆధారిత 4,400 పైచిలుకు పారిశ్రామిక పార్క్‌ల డేటాబేస్‌)కు రేటింగ్‌ నివేదిక కొనసాగింపు అని ఆయన తెలిపారు. మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, వ్యాపారానికి అవసరమైన సేవల లభ్యత, పర్యావరణ.. భద్రతా ప్రమాణాలు తదితర అంశాల గురించి తెలుసుని, తగు నిర్ణయం తీసుకునేందుకు ఇన్వెస్టర్లకు ఇది ఉపయోగపడగలదని మంత్రి వివరించారు.

2020లో ఐపీఆర్‌ఎస్‌ 2.0పై కసరత్తు ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలు, 51 సెజ్‌లు (ప్రత్యేక ఆర్థిక మండళ్లు) ఇందులో పాల్గొన్నాయి. 478 నామినేషన్లు రాగా 449కి సంబంధించి 5,700 మంది కిరాయిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. మరోవైపు, 30–40 దేశాలకు మించి .. సుమారు 5.6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని పారిశ్రామిక పార్క్‌ల వివరాలను ఐఐఎల్‌బీలో ఒక్క క్లిక్‌తో  పొందవచ్చని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ సెక్రటరీ అనురాగ్‌ జైన్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు