ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ వెళ్లొచ్చు.. ధర ఎంతంటే..?

27 Sep, 2021 19:11 IST|Sakshi

రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో పోటీ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పటికే, ఓలా ఎలక్ట్రిక్, అథర్, బజాజ్, టీవీఎస్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తమ విడుదల చేశాయి. ఈ కంపెనీలు తమకంటూ ప్రత్యేకతను చాటుకున్నాయి. అయితే, తాజాగా మరో కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొనివచ్చేందుకు సిద్దం అవుతుంది. ఈ స్కూటర్ రేంజ్ గురుంచి చెబితే మీరు నోరెళ్ళ బెట్టాల్సిందే. రాఫ్ట్ మోటార్స్ అనే కంపెనీ ఇండస్ ఎన్ఎక్స్ పేరుతో మార్కెట్లోకి తీసుకొని రాబోతుంది. రాఫ్ట్ కంపెనీ నవంబర్ 2, 2021న దీనిని లాంఛ్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది.(చదవండి: దేశంలో 'ఈ' కార్ల అమ్మకాలు బంద్!)

ఇండస్ ఎన్ఎక్స్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ దూరం వెళ్లొచ్చు అని కంపెనీ పేర్కొంటుంది. ఇందులో రెండు రకాల మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.  ఒకటి ఎకో మోడ్, మరొకటి స్పీడ్ మోడ్. ఎకో మోడ్‌లో(25 కి.మీ/గం) వెళ్తే ఈ స్కూటర్ 550 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది, స్పీడ్ మోడ్‌లో(40-45 కి.మీ/గం) వెళ్తే 480 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌ను మూడు వేరియంట్లలో తీసుకొని రానున్నారు. దీని ధర స్కూటర్ రేంజ్ బట్టి మారే అవకాశం ఉంది.

ఇండస్ ఎన్ఎక్స్ ధర:

Range Price
480 కి.మీ.  2,57,431
325 కి.మీ.  1,91,971
165 కి.మీ.      1,18,500

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సాధారణ చార్జర్ ద్వారా ఫుల్ చార్జ్ చేయడానికి కనీసం 8 -24 గంటల సమయం పడుతుంది. అదే కంపెనీ అందించే ఫాస్ట్ చార్జర్ ద్వారా 5 గంటలలో ఫుల్ చార్జ్ చేయవచ్చు. ఇందులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఇందులో రివర్స్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం 11.5 కిలోవాట్లు. ఇందులో ప్రధాన లోపం ఏమిటంటే దీని గరిష్ట స్పీడ్ 50 కి.మీ మాత్రమే.
 

మరిన్ని వార్తలు