49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్‌ ఆలస్య రుసుము తగ్గింపు

19 Feb, 2023 04:51 IST|Sakshi

న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్‌ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్‌ జీఎస్‌టీఆర్‌–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్‌ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్‌ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్‌ జీఎస్‌టీఆర్‌–4, ఫామ్‌ జీఎస్‌టీఆర్‌–9, ఫామ్‌ జీఎస్‌టీఆర్‌–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది.  

రాష్ట్రాలకు పరిహార బకాయిలు..
2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్‌ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్‌ జనరల్‌ నుంచి సర్టిఫికేట్‌లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్‌ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి.  

బెల్లం పానకంపై తగ్గింపు..
ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్‌ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్‌ షార్ప్‌నర్స్‌కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్‌ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. 

మరిన్ని వార్తలు