రూ.7వేల కోట్ల బిజినెస్‌ వద్దన్న కుమార్తె, కంపెనీని అమ్మకానికి పెట్టిన తండ్రి

26 Nov, 2022 19:54 IST|Sakshi

దేశీయ దిగ్గజ ప్యాకేజ్డ్‌ వాటర్‌ సంస్థ బిస్లెరీని ఆ సంస్థ అధినేత రమేష్‌ చౌహాన్‌ అమ్మేస్తున్నారు. వృద్దాప్యం దృష్ట్యా రూ.7వేల కోట్ల విలువైన బిస్లెరీ బాధత్యల్ని తన కుమార్తె జయంతి చౌహాన్‌ (జేఆర్‌సీ) కు అప్పగించాలని అనుకున్నారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో బిస్లెరీని అమ్మేందుకు సిద్ధమయ్యారు.  

అయితే ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సుమఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో వేల కోట్ల కంపెనీని వదులుకుంటున్న జయంతి చౌహాన్‌ పేరు చర్చాంశనీయంగా మారగా..ఆమె గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

ప్రస్తుతం బిస్లెరీ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్న జయంతి చౌహాన్‌ బాల్యాన్ని ఢిల్లీ, బాంబే, న్యూయార్క్‌ సిటీలో గడిపారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె లాస్‌ ఏంజెలెస్‌లోని ఫ్యాషన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ మర్చండైజింగ్ (ఎఫ్‌ఐడీఎం)లో ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్,మారంగోని మిలన్ ఇన్స్టిట్యూట్‌లో ఫ్యాషన్‌ స్టైలింగ్‌ పూర్తి చేశారు. 

 బిస్లెరీ అఫిషీయల్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నట్లుగా..  24ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి రమేష్‌ చౌహాన్‌ అడుగు జాడల్లో నడుస్తూ బిస్లెరీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. 

ఢిల్లీ ఆఫీస్‌ బాధ్యతల్ని బుజాలకెత్తుకున్న ఆమె సంస్థ రూట్‌ లెవల్‌ నుంచి ఫ్యాక్టరీలో వివిధ విభాగాల్లో ఆటోమెషిన్‌ టెక్నాలజీని వినియోగించేలా పునరుద్ధరించారు. వీటితో పాటు హెచ్‌ఆర్‌, సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో నిష్ణాతులైన సిబ్బందిని తయారు చేశారు. 2011లో ముంబై ఆఫీస్‌ బాధ్యతల్ని స్వికరించారు. 

బిస్లెరీ మినరల్‌ వాటర్‌, హిమాలయా పర్వతాల‍్లో లభించే నీటితో తయారు చేసిన వేదిక నేచురల్‌ మినరల్‌ వాటర్‌, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ ఫ్యాక్టరీలకు చెందిన ప్రొడక్షన్‌, సర్వీస్‌,డిస్టిబ్యూషన్‌, మేనేజ్మెంట్‌ విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు బిస్లెరీ సంస్థ అడ్వటైజ్మెంట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ డెవలప్‌మెంట్ విభాగాల్లో చురుగ్గా పనిచేశారు. 

బిస్లెరీ బ్రాండ్‌ వ్యాల్యూని పెంచుతూ సేల్స్‌, మార్కెటింగ్‌ టీమ్స్‌కు నాయకత్వం వహిస్తున్నారు. బిస్లెరీ బ్రాండ్ ఇమేజ్,పెరుగుతున్న పోర్ట్‌ఫోలియో వెనుక ఆమె వ్యాపార నైపుణ్యం దాగి ఉందని బిస్లెరీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. 

మరిన్ని వార్తలు