మారుతున్న ‘5 స్టార్‌’ రుచులు

20 May, 2021 01:52 IST|Sakshi

కొత్త రుచులతో సరికొత్త ఆహార పదార్థాలు

వ్యాధి నిరోధక శక్తిని పెంచే వాటిపై దృష్టి

మూలికలు, దినుసుల వాడకం

నిపుణుల సలహాలతో తయారీ

5 స్టార్‌ హోటళ్ల నయా వ్యాపారం

న్యూఢిల్లీ: మారిన పరిస్థితుల్లో 5 స్టార్‌ హోటళ్లు నూతన వ్యాపార అవకాశాలపై దృష్టి పెడుతున్నాయి. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం గతేడాది మార్చి, ఏప్రిల్‌లో విధించిన లాక్‌డౌన్‌లు స్టార్‌ హోటళ్లకు కొత్త మార్గాలను వెతుక్కునేలా చేశాయి. ఈ క్రమంలోనే కోరుకున్న ఆహారాన్ని కస్టమర్ల ఇంటికే డెలివరీ చేసే వ్యాపారాన్ని కొన్ని ప్రారంభించాయి. ఆ తర్వాత లాక్‌డౌన్‌లు క్రమంగా తొలగిపోయినప్పటికీ.. హోటళ్ల వ్యాపారం పెద్దగా పుంజుకున్నది లేదు. ఈలోపే కరోనా రెండో వేవ్‌ (దశ) వచ్చి పడింది.

ఫలితంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు లేదా కర్ఫ్యూల పేరుతో ఆంక్షల బాట పట్టాయి. ఈ క్రమంలో కస్టమర్ల అవసరాలపై 5 స్టార్‌ హోటళ్లు దృష్టి సారించాయి. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల అందరిలోనూ శ్రద్ధ కొంత పెరిగిన విషయం వాస్తవం. దీన్ని ఎందుకు వ్యాపార అవకాశంగా మార్చుకోకూడదు? అన్న ఆలోచన వాటికి వచ్చింది. దీంతో మంచి పోషకాహారం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలతో సరికొత్త రుచుల మెనూ తయారీని ప్రారంభించాయి. ఆకర్షణీయమైన ధరలను నిర్ణయించడం ద్వారా మరింత మంది కస్టమర్లను చేరుకునేందుకు వ్యూహాలను అమలు చేస్తున్నాయి.  

ఫీల్‌ మెనూ
ఐటీసీ హోటల్స్‌ కూడా ఇదే విధంగా ‘ఫీల్‌మెనూ’ను రూపొందించింది. దీని ద్వారా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించాలన్న ప్రణాళికతో ఉంది. రుతువుల వారీగా స్థానికంగా లభించే ముడిసరుకులతో (వ్యాధి నిరోధక శక్తిని పెంచేవి) ఆహారపదార్థాలను అందించాలనుకుంటోంది. ‘‘ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహార రుచులను ఎన్నింటినో ఇప్పటికే అందిస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా సూపర్‌ ఫుడ్‌గా పరిగణించే వాటిని మా జాబితాలోకి చేర్చనున్నాము’’ అని ఐటీసీ హోటల్స్‌ కార్పొరేట్‌ చెఫ్‌ మనీషా బాసిన్‌ చెప్పారు. ఇద్దరి భోజనానికి ధర రూ.1,100–1,400 మధ్య ఉంటుందని ఆమె తెలిపారు. అంటే ఐటీసీ ఆన్‌లైన్‌ హోమ్‌ డెలివరీ బ్రాండ్‌ గోర్మెట్‌కచ్‌తో పోలిస్తే ఈ ధరలు తక్కువగానే ఉన్నాయి.

ఈ నెల 25న ఐటీసీ సరికొత్త ఆహారపదార్థాల మెనూను విడుదల చేయనుంది. దేశవ్యాప్తంగా అన్ని ఐటీసీ హోటళ్లలో ఈ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండనున్నాయి. తాజ్, జింజెర్‌ బ్రాండ్‌ హోటళ్లను కలిగిన ఇండియన్‌ హోటల్‌ కంపెనీ రెండు వారాల కిందటే ప్రత్యేకమైన ఆహారపదార్థాల జాబితాను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ క్యుమిన్‌పై ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా ఇన్ఫెక్షన్‌ బారిన పడిన తర్వాత కోలుకునే సమయంలో వివిధ వయసుల వారికి అవసరమైన పోషకాహార పదార్థాలు ఇందులో ఉన్నాయి. కొట్టక్కల్‌ ఆర్యవైద్యశాలకు చెందిన నిపుణుల సలహాల మేరకు కొత్త పదార్థాలను ఈ సంస్థ రూపొందించింది. రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలను కలిగిన మూలికలు, దినుసులు, ఇతర పదార్థాలను ఇందులో వినియోగిస్తున్నట్టు ఇండియన్‌ హోటల్‌ ‘క్యుమిన్‌’ కమర్షియల్‌ డైరెక్టర్‌ జహంగీర్‌ తెలిపారు.  

ఒబెరాయ్‌ సైతం..: ఒబెరాయ్‌ గ్రూపు హోటళ్లలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారపదార్థాలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్‌పై కస్టమర్ల ఇంటికి డెలివరీ సైతం చేస్తున్నాయి. మునగ, ఖర్జూరం, పుట్టగొడుగులు, బ్రొక్కోలి తదితర ముడి పదార్థాలుగా ఆహార పదార్థాలను ఒబెరాయ్‌ గ్రూపు హోటళ్లు ఆఫర్‌ చేస్తున్నాయి.

మూడ్‌ డైట్స్‌...
మారియట్‌ ఇంటర్నేషనల్‌ ‘మూడ్‌ డైట్స్‌’ పేరుతో మెనూను పరిచయం చేయనుంది. ఈ సంస్థ ఇప్పటికే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సేవలను ‘మారియట్‌ ఆన్‌ వీల్స్‌’ బ్రాండ్‌ కింద నిర్వహిస్తోంది. ఈ నెల చివరి నుంచి ఆహార ప్రియులకు మంచి భావనలను కల్పించే మూడ్‌ డైట్స్‌ను సైతం మారియట్‌ ఆన్‌ వీల్స్‌ వేదికగా అందించనుంది. ‘‘డార్క్‌ చాక్లెట్, కాఫీ, అరటి, బెర్రీలు, నట్స్, సీడ్స్‌ మంచి భావనలను కల్పించే ఆహార పదార్థాలు. మనకు తెలియకుండానే వీటిని తరచుగా తింటుంటాం. దీంతో ఈ ఆహార పదార్థాలనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించాం’’ అని మారియట్‌ఇంటర్నేషనల్‌ కలినరీ డైరెక్టర్‌ హిమాన్షు తనేజా తెలిపారు. మంచి ఆహారం మంచి భావనలకు మధ్యనున్న అనుబంధం నుంచి తమకు ఈ ఆలోచన వచ్చినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు