బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన ప్రబుద్ధుల్లో ఈయనే నెంబర్‌ వన్‌!

21 Dec, 2022 16:30 IST|Sakshi

పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో బ్యాంకు రుణాల ఎగవేతదారులపై చర్చి జరిగింది. సభలోని ఓ సభ్యుడు లేవనెత్తిన ప్రశ్నపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. మార్చి 31,2022 నాటికి మనదేశంలో సుమారు 50 మంది బ్యాంకులకు రూ.92,570 కోట్లు బాకీ పడినట్లు తెలిపారు. వారిలో వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఛోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ కంపెనీ నుంచి బ్యాంకులకు రావాల్సిన మొత్తం రూ.7,848 కోట్లని వివరించారు. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి సేకరించిన రిపోర్ట్‌ ఆధారంగా కరాద్‌  బ్యాంకు రుణాలు ఎవరు? ఎంతంత? రుణ ఎగవేతకు పాల్పడ్డారో స్పష్టం చేశారు.రుణ ఎగవేత దారుల్లో ఛోక్సీ తర్వాత ఎరా ఇన్ఫ్రా (రూ.5879 కోట్లు),రేగో ఆగ్రో (రూ.4803), ‌కాస్ట్ స్టీల్ అండ్ పవర్ (రూ.4,596 కోట్లు), ఎబిజి షిప్‌యార్డ్ (రూ.3,708 కోట్లు), ఫ్రాస్ట్ ఇంటర్నేషనల్ (రూ.2,893కోట్లు),విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ (రూ.2,931కోట్లు), రోటోమాక్ గ్లోబల్ (రూ.2,893 కోట్లు), కోస్టల్ ప్రాజెక్ట్‌ రూ.2,311కోట్లు, జూమ్ డెవలపర్లు (రూ.2,147 కోట్లు) జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 

తగ్గిన ఎన్‌పీఏలు
ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు లేదా నాన్ ఫర్మామెన్స్ అసెట్స్ (NPA)రూ.8.9లక్షల కోట్లుకు చేరాయి. అయితే మొండి బకాయిల్ని తగ్గించేందుకు కేంద్రం కృషి చేయడంతో అవికాస్త రూ.3లక్షల కోట్లు తగ్గాయి. 

రైట్‌ - ఆఫ్‌లో ఎస్‌బీఐ అగ్రస్థానం 
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మొండి బకాయిల్ని రైట్‌ ఆఫ్‌ చేయడంలో రూ.2లక్షల కోట్లతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.67,214 కోట్లతో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లు ఉన్నాయి.ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.50,514 కోట్లు,హెచ్‌డీఎఫ్‌సీ రూ.34,517కోట్లు ఉన్నాయని కరాద్‌ పార్లమెంట్‌లో రుణాల ఎగవేతపై మాట్లాడారు. ఈ సందర్భంగా రుణ ఎగవేత దారులపై చర్యలు తీసుకునేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

మెహుల్‌ చోక్సీపై మూడు కొత్త ఎఫ్‌ఐఆర్‌లు 
పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మెహుల్ చోక్సీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గత వారం మూడు కొత్త ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని మూడు సభ్య బ్యాంకుల కన్సార్టియంకు చోక్సీ మరియు ఇతరులు ₹ 375.71 కోట్ల తప్పుడు నష్టం కలిగించారని ఈ తాజా ఎఫ్‌ఐఆర్‌లో మూడవది ఆరోపించింది .

వీల్‌ చైర్‌లో కోర్టుకు
కాగా,పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీకి గతేడాది కరేబియన్‌ దేశం డొమినికా న్యాయస్థానం బెయిల్‌ మంజూరుకు నిరాకరించింది. అంటిగ్వా నుంచి తమ దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన చోక్సికి బెయిల్‌ ఇవ్వలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. చోక్సీ(62) వీల్‌ చైర్‌లో కోర్టుకు హాజరయ్యారు. చోక్సీ అక్రమంగా డొమినికాకు రాలేదని, ఆయనని ఎవరో కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చారని అందుకే బెయిల్‌ ఇవ్వాలంటూ చోక్సీ తరఫు లాయర్‌ వాదించారు.

చివరిగా :::::

 రైట్‌ - ఆఫ్‌ అంటే ఏమిటి?
ప్రతి ఏడాది ఆర్ధిక సంవత్సరం(మార్చి ముగిసే) నాటికి అన్నీ బ్యాంకులు బ్యాలెన్స్‌ షీట్‌లను బహిరంగంగా ప్రకటిస్తాయి. అంటే బ్యాంకుకు ఎంత లాభం వచ్చింది. నష్టం ఎంత వచ్చింది. మొండి బకాయిలు ఎంత ఉన్నాయని చెబుతాయి. అయితే ఆ సమయంలో బ్యాలెన్స్‌ షీట్‌లో మొండి బకాయిలు కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాయి. 

ఉదాహరణకు సురేష్‌ అనే వ్యక్తి ఎక్స్‌ అనే బ్యాంకు నుంచి రూ.10వేల కోట్లు రుణం తీసుకున్నాడు. ఆ రుణాన్ని చెల్లించకుండా ఎగవేతకు (మొండి బకాయిలు) పాల్పడ్డాడు. అప్పుడు ఆ ఎక్స్‌ బ్యాంక్‌ యాజమాన్యం తనకు వచ్చిన లాభాల్ని మొడి బకాయిల స్థానంలో చూపిస్తారు. అంటే సురేష్‌ ఎగొట్టిన రూ.10వేల కోట్లు మనకు కనిపించవు. దీన్నే రైట్‌ - ఆఫ్‌ అని పిలుస్తారు.  

మొండి బకాయిలు అంటే ఏమిటి?
బ్యాంకులు అనేక విధాలుగా లోన్లు ఇస్తూ ఉంటాయి.పెద్ద మొత్తంలో లోన్లు తీసుకుని అవి ఎగొట్టి కొందరు, బకాయిలు తీర్చే స్థోమత లేక కొందరు.ఇలా చాలామంది బ్యాంకులకు మోత మోగిస్తున్నారు.వీటినే మొండి బకాయిలు,నిరర్థక ఆస్తులు అంటారు.ఆర్ధిక పరిభాషలో వీటిని ఏన్‌పీఏ(non-performing assets)అని పిలుస్తారు.

మరిన్ని వార్తలు