ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా?

11 Aug, 2021 10:46 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. గత నెలలో 1,70,719 కార్లను తయారీ చేసింది. గతేడాది జులైలో 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసింది. వార్షిక ప్రాతిపదికన ఉత్పత్తి సామర్థ్యంలో 58 శాతం వృద్ధి నమోదయిందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 

ఏడాది క్రితంతో పోలిస్తే వాహన తయారీ గణాంకాలలో పెరుగుదల ఉన్నప్పటికీ ఈ పోలిక అర్ధవంతమైనది కాదని.. ఎందుకంటే గతేడాది జులైలో కరోనా అంతరాయం కారణంగా విక్రయాలు చాలా తక్కువ స్థాయిలో జరిగాయని తెలిపింది. 2018 జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలోని ఉత్పత్తి సామర్థ్యం తక్కువేనని పేర్కొంది.

ఈ ఏడాది జులైలో 1,67,825 ప్యాసింజర్‌ వాహనాలను ఉత్పత్తి చేయగా.. గతేడాది జులైలో ఇవి 1,05,345 యూనిట్లుగా ఉన్నాయి. మోడళ్ల వారీగా చూస్తే.. ఈ ఏడాది జులైలో ఆల్టో, ఎస్‌ప్రెస్సో 24,899 కార్లు తయారయ్యాయి. గతేడాది ఇదే నెలలో వీటి సంఖ్య 20,638గా ఉన్నాయి. వ్యాగన్‌ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్‌ వంటి కాంపాక్ట్‌ కార్లు 55,390 యూనిట్ల నుంచి 90,604 యూనిట్లకు పెరిగాయి. అదేవిధంగా జిప్సీ, ఎర్టిగా, ఎస్‌–క్రాస్, విటారా బ్రెజా, ఎక్స్‌ఎల్‌6 వంటి యుటిలిటీ వాహనాలు 19,130 నుంచి 40,094 యూనిట్లకు వృద్ధి చెందాయి. లైట్‌ కమర్షియల్‌ వెహికిల్స్‌ ఉత్పత్తి గత నెలలో 2,894 యూనిట్లు కాగా.. క్రితం ఏడాది జులైలో ఇవి 2,342 యూనిట్లుగా ఉన్నాయి.  

చదవండి: మనదేశంలో ఏ బ్రాండ్‌ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా కొంటున్నారో మీకు తెలుసా?

మరిన్ని వార్తలు