దేశీ విమానయానం 59% అప్‌..

12 Apr, 2022 05:50 IST|Sakshi

కోవిడ్‌ పూర్వ స్థాయికన్నా 40 శాతం తక్కువే

ఇంధన రేట్లతో ఏవియేషన్‌కు సవాళ్లు

2021–22పై ఇక్రా అంచనా

ముంబై: గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 59 శాతం పెరిగి 8.4 కోట్లకు చేరి ఉంటుందని క్రెడిట్‌ రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. తాము ముందుగా అంచనా వేసిన 8–8.2 కోట్లతో పోలిస్తే ఇది కొంత ఎక్కువే అయినా.. కోవిడ్‌ పూర్వ స్థాయితో పోలిస్తే దాదాపు 40 శాతం తక్కువని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ సుప్రియో బెనర్జీ తెలిపారు. భౌగోళిక–రాజకీయ సమస్యలతో ఆకాశాన్నంటుతున్న విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు సమీప కాలంలోనూ ఏవియేషన్‌ పరిశ్రమకు సవాలుగా కొనసాగే అవకాశం ఉందన్నారు.

పరిశ్రమ లాభదాయకతను నిర్దేశించే అంశాల్లో ఇవి కీలకంగా ఉంటాయని బెనర్జీ పేర్కొన్నారు. ఇక్రా నివేదిక ప్రకారం.. మహమ్మారి ప్రభావాలు తగ్గుముఖం పడుతూ.. విమానయానం పుంజుకుంటున్న నేపథ్యంలో సీక్వెన్షియల్‌ ప్రాతిపదికన మార్చిలో ప్రయాణికుల సంఖ్య 37 శాతం పెరిగి 1.06 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరిలో ఇది 77 లక్షలుగా ఉంది. గతేడాది మార్చితో (78 లక్షలు) పోలిస్తే 35 శాతం వృద్ధి చెందింది.  

ఫ్లయిట్లు 12 శాతం వృద్ధి..
గతేడాది మార్చితో పోలిస్తే ఫ్లయిట్ల సంఖ్య 12 శాతం పెరిగి 71,548 నుంచి 80,217కి చేరిందని ఇక్రా తెలిపింది. ఫిబ్రవరితో పోలిస్తే సర్వీసులు 42 శాతం పెరిగాయి. కోవిడ్‌–19 థర్డ్‌ వేవ్‌ ఉధృతి తగ్గుముఖం పట్టడం, టీకాల ప్రక్రియ వేగం పుంజుకోవడం, ప్రయాణాలపై ఆంక్షలను ఎత్తివేస్తుండటం వంటి అంశాలు ఇందుకు దోహదపడినట్లు ఇక్రా వివరించింది. ఒక్కో ఫ్లయిట్‌లో ప్రయాణికుల సంఖ్య ఫిబ్రవరిలో సగటున 135గా ఉండగా మార్చిలో 132గా నమోదైంది.

దాదాపు రెండేళ్ల అంతరాయం తర్వాత మార్చి 27 నుండి అంతర్జాతీయ విమానయాన సర్వీసులు ప్రారంభం కావడం ఏవియేషన్‌ రంగానికి సానుకూలాంశమని ఇక్రా పేర్కొంది. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతల కారణంగా తలెత్తిన భౌగోళిక–రాజకీయ సమస్యలు, క్రూడాయిల్‌ రేట్ల పెరుగుదల వంటి అంశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏటీఎఫ్‌ ధరలు 93 శాతం ఎగిసినట్లు వివరించింది. ఏవియేషన్‌ రంగానికి ఏటీఎఫ్‌ ధరలపరమైన సవాళ్లు కొనసాగుతాయని, 2023 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలపై ఇవి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది.

మరిన్ని వార్తలు