అందుబాటులోకి 5జీ, భారత్‌లో ఇక టెక్నాలజీకి తిరుగుండదు

5 Oct, 2022 09:48 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో 5జీ సేవలు అందుబాటులోకి రావడమనేది టెక్నాలజీని మెరుగుపర్చుకోవడానికి సంబంధించి ఒక ఉత్ప్రేరకం లాంటి ఘటనగా ఉండగలదని చిప్‌సెట్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ సీఈవో క్రిస్టియానో అమోన్‌ తెలిపారు. 

లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియా, మధ్య ప్రాచ్యంలోని వర్ధమాన దేశాల్లో 5జీ విస్తరించడానికి దోహదపడగలదని పేర్కొన్నారు. అలాగే, వివిధ ధరల్లో 5జీ పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు సహాయపడుతుందని అమోన్‌ వివరించారు. 

మరోవైపు, భవిష్యత్‌ డిజిటల్‌ ఎకానమీలో ఎలక్ట్రానిక్‌ చిప్స్‌ కీలకమైనవిగా మారనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్‌ పరిశ్రమలో ముఖ్య పాత్ర పోషించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 

పటిష్టమైన సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థను నిర్మించడం ఏ ఒక్క దేశం వల్లనో సాధ్యం కాదని.. ఇందుకోసం అమెరికా, యూరప్‌ దేశాలు, భారత్‌ మొదలైనవన్నీ కలిసి పనిచేయాల్సి ఉంటుందని అమోన్‌ పేర్కొన్నారు.    

మరిన్ని వార్తలు