5జీ స్మార్ట్‌ఫోన్లదే హవా

11 Feb, 2023 06:17 IST|Sakshi

74 శాతం పెరిగిన విక్రయాలు

ఈ ఏడాదీ అమ్మకాల జోరు

సైబర్‌ మీడియా రీసెర్చ్‌ నివేదిక

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు జోరందుకున్నాయి. 2021తో పోలిస్తే గతేడాది 5జీ మోడళ్ల అమ్మకాలు 74 శాతం అధికం అయ్యాయి. కస్టమర్ల చేతుల్లోకి వెళ్లిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ల విలువ సుమారు రూ.1.65 లక్షల కోట్లు ఉంటుందని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ (సీఎంఆర్‌) తన నివేదికలో వెల్లడించింది. కఠినమైన మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో 2022లో మొత్తం మొబైల్స్‌ సేల్స్‌ 17 శాతం, స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 8 శాతం తగ్గడం గమనార్హం. అంత క్రితం ఏడాదితో పోలిస్తే 2022 అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ 28 శాతం క్షీణించింది.  2023లో స్మార్ట్‌ఫోన్ల పరిశ్రమ చక్కటి వృద్ధి తీరుతో  16–16.5 కోట్ల యూనిట్లు ఉండే వీలుంది.

ప్రీమియం వైపునకు మార్కెట్‌..
మరోవైపు రూ.1 లక్ష ఆపైన ఖరీదు చేసే అల్ట్రా ప్రీమియం విభాగం ఏకంగా 95 శాతం దూసుకెళ్లిందని సీఎంఆర్‌ వెల్లడించింది. రూ.7 వేల లోపు ధర ఉండే మొబైల్స్‌ సేల్స్‌ గతేడాది 55 శాతం తగ్గాయి. సరఫరా సమస్యలు, ఆర్థిక సవాళ్లు ఇందుకు కారణం. రూ.7–25 వేల ధరల శ్రేణిలో విక్రయాలు 8 శాతం క్షీణించాయి. రూ.25,000 నుంచి రూ.50,000 మధ్య ఉండే ప్రీమియం మోడళ్ల అమ్మకాలు 12 శాతం, రూ.50,000 నుంచి రూ.1 వరకు ఉండే సూపర్‌ ప్రీమియం 41 శాతం దూసుకెళ్లాయి. స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో యాపిల్‌ వాటా 4 శాతం. గతేడాది ఈ సంస్థ 17 శాతం వృద్ధి నమోదు చేసింది. యాపిల్‌ విక్రయాల్లో రూ.50,000–1,00,000 ధరల శ్రేణి మోడళ్ల వాటా 79 శాతం ఉంది. 

>
మరిన్ని వార్తలు