ఐఫోన్‌ యూజర్లకు షాక్‌.. వామ్మో రెండు నెలలు వరకు..

12 Oct, 2022 18:59 IST|Sakshi

దేశంలో 5జీ(5G) సేవల కోసం స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 5జీ సేవల ప్రారంభం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. 5జీ సేవలు ప్రారంభమైనా, ఇంకా కొన్ని స్మార్ట్‌ఫోన్లలో దానికి అనువైన సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఈ జాబితాలో ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ యాపిల్‌ కూడా ఉంది. తాజాగా ఈ అంశంపై ఐఫోన్‌ మేకింగ్‌ కంపెనీ స్పందించింది.

డిసెంబర్‌ వరకు ఆగండి
ప్రస్తుతం తమ కంపెనీ ఫోన్లలో 5జీ సేవలను వినియోగించేలా అప్‌డేట్‌ చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు విజయవంతం కాగానే అప్‌డేట్‌ అందిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని, డిసెంబరు నాటికి ఐఫోన్‌ 14 సహా మిగిలిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.


ప్రస్తుతం ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్‌ ఎస్‌ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి.  ప్రస్తుతం భారత్‌లో ఎయిర్‌టెల్‌, జియో ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాపిల్‌ కూడా ఈ రెండు 5జీ నెట్‌వర్క్‌లపై పరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు ఇప్పటికే కోట్ల మంది 5జీ స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసుకుని, ఈ సేవలను వినియోగించాలని ఎదురుచుస్తున్నారు.


దీంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం.. టెలికాం రంగంలోని ప్రముఖులతో పాటు ఫోన్ తయారీదారులు, చిప్ తయారీదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీస్ ప్రొవైడర్లు, అనేక పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చే​యనుంది.


దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్‌ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనుంది.

చదవండి: క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా?

మరిన్ని వార్తలు