మహిళల ఓటు రియల్‌ ఎస్టేట్‌కే

6 Mar, 2023 06:12 IST|Sakshi

65 శాతం మంది ఎంపిక ఇదే

స్టాక్స్‌కు 20 శాతం అనుకూలం

అనరాక్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశంలో మెజారిటీ మహిళలు సొంతింటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. తాము రియల్టీలో పెట్టుబడులు పెడతామని 65 శాతం మంది మహిళలు ఓ సర్వేలో భాగంగా చెప్పారు. 20 శాతం మంది తాము స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తామని ప్రకటించగా, 8 శాతం మంది బంగారానికి ఓటు చేశారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ‘అనరాక్‌’ ఈ సర్వేని నిర్వహించింది. 5,500 మంది వినియోగదారుల అభిప్రాయాలను అనరాక్‌ సర్వే తెలుసుకుంది. ఇందులో సగం మంది మహిళలు పాల్గొన్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ఇన్వెస్ట్‌ చేస్తామని 7 శాతం మంది చెప్పారు.

రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తామని చెప్పిన వారిలో 83 శాతం మంది రూ.45 లక్షలకు పైన ధర కలిగిన వాటిని తీసుకుంటామని తెలిపారు. ‘‘ఇంటిని కొనుగోలు చేయాలనుకునే మహిళల్లో 33 శాతం మంది రూ.45–90 లక్షల శ్రేణిలో ఉన్న వాటికి అనుకూలంగా ఉన్నారు. 27 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య బడ్జెట్లో చూస్తున్నారు. ఇక 20 శాతం మంది రూ.1.5 కోట్లకుపైన ఉన్న విలాసవంతమైన ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రూ.45 లక్షల్లోపు ధరలోని అందుబాటు ధరల ఇళ్లు చాలా తక్కువ మంది ఎంపికగా ఉన్నాయి’’అని అనరాక్‌ వెల్లడించింది. గతంలో మహిళలు ఇళ్లను 77 శాతం మేర నివాసం కోసమే తీసుకోగా, తాజాగా అది 82 శాతానికి చేరింది. మిగిలిన వారు పెట్టుబడుల కోణంలో తీసుకుంటున్నారు.

పలు ప్రయోజనాలు..
మహిళలు తమ పేరిట ఇళ్లను కొనుగోలు చేయడం వల్ల పలు ప్రయోజనాలు పొందొచ్చని అనరాక్‌ సూచించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పేరిట యాజమాన్య హక్కులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. 2015లో తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద ప్రయోజనాలు పొందాలంటే ప్రాపర్టీ మహిళల పేరిట నమోదు చేయడం లేదంటే సహ యజమానిగా ఉండాలన్న విషయాన్ని ప్రస్తావించింది. మహిళలకు స్టాంప్‌ డ్యూటీ చార్జీలు తక్కువగా ఉండడాన్ని కూడా పేర్కొంది. బ్యాంకులు మహిళలకు తక్కువ రేట్లపై గృహ రుణాలను ఇస్తున్నట్టు తెలిపింది.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు