భారత్‌లో భారీగా టెక్నాలజీ స్కామ్‌లు! 

23 Jul, 2021 00:01 IST|Sakshi

న్యూఢిల్లీ: గడిచిన 12 నెలల్లో భారత్‌లో టెక్నాలజీ ఆధారిత స్కామ్‌లు గణనీయంగా పెరిగాయి. ప్రతి 10 మంది వినియోగదారుల్లో ఏడుగురు వీటి బారినపడ్డారు. 2021కి గాను ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2018 తరహాలోనే (70%) గత పన్నెండు నెలల కాలంలో దేశీ వినియోగదారులు స్కామ్‌ల బారిన పడిన సందర్భాలు 69% పెరిగినట్లు నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే ఇది 5% తగ్గి 59%కి పరిమితమైనట్లు పేర్కొంది. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్‌ తదితర 16 దేశాల్లో మైక్రోసాఫ్ట్‌ తరఫున మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ యూగవ్‌ సర్వే నిర్వహించింది. 16,254 మంది (ప్రతి దేశం నుంచి సుమారు 1,000 మంది) ఇందులో పాల్గొన్నారు.

నగదు బదిలీల్లో ఎక్కువగా..
దేశీ వినియోగదారులు టెక్నాలజీ స్కాముల్లో ఈ ఏడాది సగటున రూ. 15,334 మేర నష్టపోయారు. అయితే, 88 శాతం మంది తాము పోగొట్టుకున్న డబ్బులో కొంతైనా రాబట్టుకోగలిగారు. సగటున రూ. 10,797 రికవర్‌ చేసుకోగలిగారు. ఎక్కువగా మోసాలు.. బ్యాంక్‌ ట్రాన్స్‌ఫర్‌లు (43 శాతం), గిఫ్ట్‌ కార్డులు (38%), పేపాల్‌ (32%), క్రెడిట్‌ కార్డులు (32 శాతం), బిట్‌కాయిన్‌ (25%) చెల్లింపు విధానాల ద్వారా జరిగాయి. తమంత తాముగా సంప్రదించే అపరిచితులను సులువుగా విశ్వసించే స్వభావం, కంపెనీలే నేరుగా సంప్రదిస్తాయనే అభిప్రాయం వల్ల భారత్‌లో వినియోగదారులు ఎక్కువగా మోసాల బారిన పడటానికి దారి తీస్తోందని నివేదిక పేర్కొంది. 

మరిన్ని వార్తలు