విదేశాలకు దేశీయ 6జీ టెక్నాలజీ ఎగుమతి!

24 Nov, 2021 20:44 IST|Sakshi

2024 నాటికి భారత్ దేశంలో 6జీ టెక్నాలజీని అమలులోకి తీసుకొని రావడానికి కృషి చేస్తున్నట్లు కమ్యూనికేషన్ శాఖ మంత్రి అశ్వినీ వైష్నావ్ నేడు(నవంబర్ 24) తెలిపారు. 6జీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేయడానికి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇచ్చినట్లు ఆయన అన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ సహాయంతో 6జి టెక్నాలజీని రూపొందించనున్నట్లు వైష్నావ్ పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నట్లు తెలిపారు. 

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) 5జీ కోసం సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించినట్లు, 2022 ద్వితీయార్ధంలో స్పెక్ట్రమ్ వేలం వేయనున్నట్లు ఆయన అన్నారు. "5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్(టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియ రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరి-మార్చి వరకు ముగుస్తుంది. ఈ వేలం ప్రక్రియ తర్వాత 2022 క్యూ2 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది" అని వైష్నావ్ తెలిపారు. 

(చదవండి: తప్పిన తిప్పలు.. ఆన్‌లైన్‌లో అందుబాటులోకి జియోఫోన్ నెక్ట్స్!)

మరిన్ని వార్తలు