ప్రమాదంలో 70 లక్షల డెబిట్, క్రెడిట్ యూజర్లు

10 Dec, 2020 19:33 IST|Sakshi

క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు చేదువార్త. 70 లక్షల మంది భారతీయుల క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు డార్క్ వెబ్‌లో లీక్ అయ్యాయి. భారతీయ సైబర్ సెక్యురిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజారియా తెలిపిన వివరాల ప్రకారం, లీక్ అయిన డేటాలో భారతీయ క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆదాయ వివరాలు, ఖాతా వివరాలు మరియు మరిన్ని ఉన్నాయి. బయటకి వచ్చిన డేటాలో 2010 నుండి 2019 వరకు గల వినియోగదారుల సమాచారం ఉంది.(చదవండి: ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున)

గూగుల్ డ్రైవ్ లింక్‌లోని 2 జీబీ డేటాబేస్‌లో క్రెడిట్, డెబిట్ కార్డుదారుల ఫోన్ నంబర్లు, ఇమెయిల్ చిరునామాలు, వినియోగదారుల యజమానుల పేరు, పాన్ కార్డ్, వార్షిక ఆదాయం వివరాలు ఉన్నాయి. డార్క్ వెబ్‌లోని ఫోరమ్స్ కస్టమర్ల డేటాను సర్క్యులేట్ చేస్తున్నట్టు రాజశేఖర్ గుర్తించారు. ఈ డేటాను సైబర్ నేరాలు, మోసాలు, ఫిషింగ్ దాడులు, ఆన్‌లైన్ మోసాలకు ఉపయోగించొచ్చు. డార్క్ వెబ్‌లో బహిర్గతం చేసిన డేటాలో యాక్సిస్ బ్యాంక్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, కెల్లాగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెకిన్సే అండ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగులతో పాటు ఇంకొంత మందికి సమాచారం ఉన్నట్లు ఇంక్ 42 తన నివేదికలో పేర్కొంది. ఈ ఉద్యోగుల వార్షిక ఆదాయం రూ.7 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుందని నివేదికలో పేర్కొంది. క్రెడిట్/డెబిట్ కార్డులను విక్రయించడానికి బ్యాంకులు ఒప్పందం కుదుర్చుకున్న థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లు డార్క్ వెబ్‌లో ఈ సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని రాజహరియా తన నివేదికలో పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ డేటా ఇంటర్నెట్‌లో అత్యంత ఖరీదైన డేటా అని రాజశేఖర్ అన్నారు. రాజశేఖర్ రజారియా ఈ విషయం గురుంచి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్టి-ఇన్)ను సంప్రదించారు. కానీ ఈ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి స్పందన లేదు. ఇంటర్నెట్‌లో డేటా లీక్‌ల కేసులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు నవంబర్‌లో ఆన్‌లైన్ గ్రోసరీ స్టోర్ హ్యాకర్ల లక్ష్యంగా మారింది. సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుల ప్రకారం, బిగ్‌బాస్కెట్ వినియోగదారుల యొక్క పూర్తి పేర్లు, ఇమెయిల్ ఐడిలు, పాస్‌వర్డ్ హాష్‌లు, కాంటాక్ట్ నంబర్లు, చిరునామాలు వంటివి హ్యాకర్ల చేతికి చిక్కడంతో డార్క్ వెబ్‌లో బహిర్గతమయ్యాయి. బిగ్‌బాస్కెట్ యూజర్ల డేటాను హ్యాకర్లు సుమారు 30 లక్షల రూపాయలకు అమ్మారు. 

మరిన్ని వార్తలు